Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లెప్రగతి సమీక్షలో సర్పంచ్ల ఆవేదన
- మా ఎమ్మెల్యే ఎవరు, మాఎమ్మెల్యే ఎక్కడ అంటూ ప్లకార్డుల ప్రదర్శన
- వేటు వేస్తామని హెచ్చరిస్తారా..
- సమావేశానికి హాజరయ్యేందుకు చాలా చోట్ల విముఖత
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ఐదవ విడత పల్లె ప్రగతి అవగాహన సమావేశానికి హాజరయ్యేందుకు సర్పంచ్‌లు విముఖత చూపించారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకపోగా, నిధులు మంజూరైనా విడుదల చేస్తలేరని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేస్తూ పనులు చేపడుతుంటే పైపెచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావు తమపై వేటు వేస్తామని అవమానించడం సరికాదని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల సమావేశానికి హాజరయ్యేందుకు విముఖత చూపగా, మరికొన్ని చోట్ల హాజరై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా తూప్రాన్‌లో టీఆర్ఎస్ సర్పంచ్‌లు మా ఎమ్మెల్యే ఎవరు, మా ఎమ్మెల్యే ఎక్కడ అంటూ నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదరిస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తూప్రాన్ మండల సర్పంచ్‌లు కొంతమంది బహిష్కరించగా, మరి కొంతమంది హజరై తాము గతంలో చేసిన పనులకే బిల్లులు రావడంలేదని ఇంకా పనులు ఎలా చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను చెప్పుకుందామంటే మా ఎమ్మెల్యే అందుబాటులో ఉండడని, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం స్వంత నియోజక వర్గం సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు కనీసం కలవడానికి సమయం ఇవ్వడంలేదని వాపోయారు. మనోహరాబాద్‌లో మండలంలో 17 మంది సర్పంచ్‌లు ఉండగా కేవలం ఐదుగురు సర్పంచ్‌లే హజరవడంతో నామమాత్రంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు ఎక్కువ ప్రజాత్రినిధులు తక్కువ అనే చందంగా సమావేశాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల సమావేశాలకు హాజరయ్యేందుకు సర్పంచ్‌లు విముఖత చూపించారు. మంగళవారం నవీపేట్, మాక్లూర్, రెంజల్ తదితర మండలాల్లో సర్పంచ్‌లు సమావేశాలకు గైర్హాజరైయ్యారు. దాంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. నవీపేట్లో సమావేశ ప్రాంగణానికి సర్పంచ్‌లు వచ్చినా.. సమావేశానికి హాజరుకాకుండా బయటే ఉండిపోయారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సమావేశం ప్రారంభం కాగానే.. డబ్బులు ఇచ్చే దాకా పల్లె ప్రగతి పనులు చేయమని, పల్లె ప్రగతి సమావేశాన్ని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సర్పంచులు అందరు కలిసి బహిష్కరించారు. అధికార పార్టీ సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పొట్ల నగేష్ లేచి నాల్గవ విడత వరకు పల్లె ప్రగతి పనులు చేశామని చేసిన పనులకు డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాదేవపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో వైస్ ఎంపీపీ పుష్పలత లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి మండల సభను సర్పంచులు బహిష్కరించారు.