Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థర్మల్ కేంద్రాల్లో తగ్గుతున్న నిల్వలు
- సింగరేణి థర్మల్ స్టేషన్‌కూ తిప్పలు
- అత్యల్ప నిల్వలు కాకతీయ న్యూ థర్మల్‌లో...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలను బొగ్గు కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైనా పడుతున్నది. స్వరాష్ట్రంలో సింగరేణి కాలరీస్ ద్వారా నల్లబంగారాన్ని తవ్వి తీస్తున్నా, ఇక్కడి థర్మల్ కేంద్రాలకూ బొగ్గు కష్టాలు తప్పట్లేదు. విచిత్రంగా సింగరేణి కాలరీస్ స్వయంగా నిర్వహిస్తున్న జైపూర్ విద్యుదుత్పత్తి కేంద్రంలోనే బొగ్గు నిల్వలు అతి తక్కువగా ఉన్నాయి. ఆయా థర్మల్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి బొగ్గు నిల్వలు ఎంత ఉండాలనే నిర్ణయాన్ని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సిఈఆర్సీ) ప్రకటించింది. రాష్ట్రంలో 5,242.5 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆరు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో సిఈఆర్సీ నిర్థారించినట్టు సాధారణ బొగ్గు నిల్వలు 1,547.2 వేల టన్నులు ఉండాల్సి ఉండగా, కేవలం 552.7 టన్నులు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో టీఎస్ జెన్కో నిర్వహణలోని ఆరు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 69.4 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో ఉత్పత్తి జరిగింది. బొగ్గు కొరత కారణంగా పీఎల్‌ఎఫ్‌ను తగ్గించుకోవాల్సి వస్తున్నదని టీఎస్ జెన్కో అధికారులు చెప్తున్నారు. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో కొత్తగా నిర్మించిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్‌కు సింగరేణి కాలరీస్ తక్కువ బొగ్గు సరఫరా చేస్తున్నందున పీఎల్ఎఫ్ తగ్గుతున్నదని సిఈఆర్సీ ప్రకటించింది. అక్కడి బొగ్గు నిల్వలు కేవలం 23 శాతం (5 రోజులకు సరిపడా) మాత్రమే ఉన్నాయని తెలుపుతూ 'క్రిటికల్ స్టాక్' కేటగిరిలో పెట్టింది. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలన్నీ స్వదేశీ బొగ్గుతోనే నడుస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖరీదు ఎక్కువగా ఉన్న విదేశీ బొగ్గును తెప్పించుకోవాల్సి వస్తుందనే ఆందోళనలో టీఎస్ జెన్కో అధికారులు ఉన్నారు. మరోవైపు సింగరేణి కాలరీస్ స్వయంగా నిర్వహిస్తున్న జైపూర్‌లోని 1,200 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో కూడిన రెండు ప్లాంట్లలో సిఈఆర్సీ మార్గదర్శకాల ప్రకారం 26 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ఈనెల మే 30వ తేదీ నాటికి ఇక్కడ కేవలం ఏడు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో ఈనెల 30 నాటికి ఉన్న బొగ్గు నిల్వలు ఇలా...
థర్మల్ స్టేషన్ ఉత్పత్తి సామర్ధ్యం ఉండాల్సిన స్టాక్ ప్రస్తుత స్టాక్
(మెగావాట్లలో) (రోజుల్లో) (రోజుల్లో)
1. భద్రాద్రి
ధర్మల్ పవర్
స్టేషన్ 1,080 26 రోజులు 14 రోజులు
2. కాకతీయ
థర్మల్ పవర్
స్టేషన్ 1,100 17 17
3. కొత్తగూడెం
థర్మల్ పవర్
స్టేషన్(న్యూ) 1,000 26 5
4. కొత్తగూడెం
థర్మల్ పవర్
స్టేషన్(స్టేజ్-7) 800 26 10
5. రామగుండం-బీ
థర్మల్ పవర్
స్టేషన్ 62.5 17 13
6. సింగరేణి
థర్మల్ పవర్
స్టేషన్ 1,200 26 7