Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూనిట్ రేటు రూ.20..
- మిగులు విద్యుత్ ఎక్కడీ
- కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ కార్యదర్శికి టీఎస్ జెన్కో సీఎమ్‌డీ రాసిన లేఖలో వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందంటూ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు పదే పదే ప్రకటించుకుంటున్నాయి. రాష్ట్రావతరణను పురస్కరించుకొని విద్యుత్‌రంగంలో సాధించిన విజయాలు అంటూ పత్రికల్లో కథనాలనూ రాయించుకుంటుంది. చిత్రగుప్తుడి లెక్కలకన్నా అర్థం ఉంటుందేమో కానీ, విద్యుత్ అధికారుల లెక్కలు మాత్రం ఎవరికీ అర్థమయ్యేలా లేవు. బయటి మార్కెట్ నుంచి వేల యూనిట్లు కొనుగోళ్లు చేస్తూనే, మిగులు విద్యుత్ రాష్ట్రం అని ప్రకటించుకోవడం విడ్డూరంగానే కనిపిస్తుంది. అదేమంటే 24/7 కరెంటు ఇస్తున్నామని చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ఎంత? బయటినుంచి కొంటున్న కరెంటు ఎంత? అని ప్రశ్నిస్తే...అర్థంకాని లాజిక్కు లెక్కలతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ లెక్కల బొక్కలు బయటపడేలా టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఈ ఏడాది మార్చి 21న రాసిన లేఖ ఒకటి బయటికొచ్చింది. నేషనల్ పవర్ ఎక్సేంజీల్లో ధరలు విపరీతంగా పెరిగాయనీ, వాటిని నియంత్రించాలని కోరుతూ ఆయన ఈ లేఖను (Lr.No.CMD/Peshi/D.No.08/21 Dt.21.03.2022) రాసారు. రాష్ట్రంలో కరెంటు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 4, 10 తేదీల్లో గరిష్ట డిమాండ్ 13,611 మెగావాట్లకు చేరగా, 265.51 మి.యూ., సరఫరా చేశామని తెలిపారు. గడచిన మూడు నెలల్లో పవర్ ఎక్సేంజ్‌లకు రాష్ట్రం నుంచి 150 మిలియన్ యూనిట్లు అమ్మి, అక్కడి నుంచి 2,432 మి.యూ., కొనుగోలు చేశామని పేర్కొన్నారు. తాము ఎక్కువ మొత్తంలో ఎక్సేంజ్‌ల నుంచి విద్యుత్ కొంటున్నామనీ, కానీ ధరలు గరిష్టంగా రూ.20 వరకు పెరిగాయని ఆ లేఖలో తెలిపారు. ధరల పెరుగుదల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలపై (డిస్కంలు) ఆర్థిక భారం పడుతున్నదనీ, ధరల్ని నియంత్రించాలనేది ఆ లేఖ సారాంశం. తాజాగా తప్పనిసరై గడచిన మూడు వారాల్లో యూనిట్ రూ.15 నుంచి రూ. 20 చొప్పున 53.11 మి.యూ., కరెంటు కొనుగోలు చేశామనీ చెప్పుకొచ్చారు. గడచిన ఏడాది నవంబర్‌లో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి ఇచ్చిన వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనల్లోనూ రాష్ట్రం మిగులు విద్యుత్‌లో ఉందనే పేర్కొన్నాయి. దీనికి టీఎస్ఈఆర్సీ కూడా ఆమోదం తెలిపింది. మూడు నెలల్లో కేవలం 150 మి.యూ., పవర్ ఎక్సేంజ్‌లకు (సంప్రదాయ ఇంధన వనరుల కింద సోలార్ విద్యుత్‌ను) అమ్మి, అక్కడి నుంచి 2,432 మి.యూ., కొనుగోలు చేయడం మిగులు ఎలా అవుతుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది!