Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ కార్యాలయంలో అందజేసిన మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పోలీసుల పనితీరును మరింత సమర్థవంతంగా చేయడానికి 17 ఫంక్షనల్ వర్టికల్స్ ఎంతగానో ఉపయోగపడతాయనీ, దీనితో ప్రజలలో పోలీసు వ్యవస్థ పట్ల మరింత భరోసా పెరుగుతుందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సభలో 256 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ఫంక్షనల్ వర్టికల్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చినందుకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా నేరానికి సంబంధించి కేసు నమోదు, ఆధారాల సేకరణ, నిందితుల గుర్తింపు, అరెస్టు త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేయడం, సకాలంలో చార్జీషీటును కోర్టులో దాఖలు చేయడం, కోర్టులు తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చేయడం తదితర 17 ఫంక్షనల్ వర్టికల్స్‌ను సమర్థవంతంగా అమలు చేసినప్పుడే పోలీసులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా, నేరం చేసిన వ్యక్తికి కచ్చితంగా శిక్షపడేలా చేయడం వలన పోలీసుల పనితీరుపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందుతుందని అన్నారు. అలాగే, నేరస్థునికి శిక్షలు సకాలంలో పడేలా చేయడం వలన దోషులలో భయాన్ని నెలకొల్పినవారమవుతామని ఆయన చెప్పారు. పోలీసు వ్యవస్థలో సమర్థతను మరింత పటిష్టం చేయడానికే ఈ 17 వర్టికల్స్‌ను శాస్త్రీయంగా రూపొందించటం జరిగిందని తెలిపారు. నగరం మొదలుకొని మారుమూల ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో పని చేసే కానిస్టేబుళ్ల వరకు ఈ వర్టికల్స్ ఇనుమడింప చేస్తాయని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందే కాక ఉన్నత స్థాయి అధికారుల వరకు ఈ విధానం వర్తిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐడీ డీజీ గోవింద్ సింగ్, సీనియర్ ఐపీఎస్ అధికారులు శివకర్ రెడ్డి, కమలాసన్ రెడ్డి, సంజయ్ జైన్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.