Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు యంత్రాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బెల్ ఇచ్చిందనీ, అది ఇచ్చిన సామగ్రి తుప్పుపట్టిన యంత్రాలు ఎలా అవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. సంజరు ఆరోపణలు చూస్తుంటే కేసీఆర్, మోడీకి పైసలిచ్చినట్టుగా ఉన్నాయన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మంత్రి పువ్వాడ అజరుకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న మాటలు విన్నాక బాధేసిందన్నారు. కరెంటు కొనుగోలులో యూనిట్‌కు 6రూపాయల నుంచి 12 రూపాయలు ఖర్చుపెట్టవచ్చునని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందన్నారు. అంబానీ, అదాని వచ్చినా కేసీఆర్ వాళ్లకు ఇవ్వకుండా ప్రభుత్వ సంస్థలకు టెండర్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్టీపీసీకి యూనిట్‌కు రూ.7 చొప్పున ఇచ్చి కరెంటు కొంటున్నామని చెప్పారు. అంబానీ, అదానీ దగ్గర కొనకుండా ఎన్టీపీసీ దగ్గర కరెంటు కొంటే అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిగిఉందన్నారు. బండిసంజరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కేసీఆర్ లేకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నట్టుగా కరెంట్ తీగలపై బట్టలు ఆరేసి పరిస్థితి ఉండేదన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలూ అప్పులు తీసుకుంటున్నాయనీ, తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని నిటి అయోగ్ చెప్పిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేననీ, రైతుల క్షేమం కోసమే అప్పులు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరుకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుతుంటే కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నదని విమర్శించారు. జీతాలకు, అప్పులకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర ఆదాయంతోనే జీతాలు, పథకాలు నడుస్తున్నాయన్నారు. కొత్త అప్పులు అడిగే మరిన్ని ప్రాజెక్టులు కట్టడానికేనన్నారు. రాష్ట్రానికి అప్పులు పుట్టే అవకాశం ఉన్నా కేంద్రం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. ఎనిమిదేండ్లలో వంద లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయొచ్చుగానీ మేము చేయవద్దా అని ప్రశ్నించారు. భద్రాద్రికి బెల్ సంస్థ నుంచి సామగ్రి కొన్నాం కాబట్టే ఇవ్వాళ తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు.