Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాల సాంస్కృతిక ఉద్యమం దిశగా అడుగులు పడాలి
- ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో కుల, మత ఆధిపత్య భావజాల వ్యాప్తి జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్ర, లౌకిక వాదులపై ఉందని ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పోరంకిలో ప్రజానాట్యమండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. మంగళవారం ఆ సభలో ఆయన సౌహార్ధ్రసందేశాన్ని ఇచ్చారు. మతోన్మాద శక్తులు సాంస్కృతిక రంగాన్ని తమ గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నాలను తీవ్రం చేశాయన్నారు. నూతన ఆర్ధిక విధానాల కారణంగా వస్తున్న ప్రజా సమస్యలపై పోరాడే ప్రజాకళలను వ్యాప్తి చెందకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. దానిలో భాగంగానే అభ్యుదయ సాహిత్యానికి, కళాకారులకు నిలయంగా ఉన్న కళా సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రకు బీజేపీ పూనుకున్నదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజానాట్యమండలి కర్తవ్యం మరింత పెరిగిందనీ, మహా సభ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, సమస్యల ఇతివృత్తంగా ప్రజాకళారూపాలను రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్లాడానికి కృషి మరింత జరగాలని ఆకాంక్షించారు. కళాకారుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమకాలీన రాజకీయ అంశాలపై నూతన రచనలు తీసుకువచ్చి విశాల, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమానికి అడుగులు పడాలని ఆకాంక్షించారు.