Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 200కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదు
- కేరళ, కర్నాటక రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు
- ఈసారి అధిక వర్షాలు కురిసే అవకాశం : ఐఎమ్‌డీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. దక్షిణం వైపు నుంచి తెలంగాణ మీదుగా గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో అత్యధికంగా 6.55 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 11 గంటల వరకు 205 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి, రంగారెడ్డి, జనగామ, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. శంషాబాద్ మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం పడింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సిన విమానాలను దారి మళ్లించారు. ఈసారి నైరుతి రుతుపవనాల వల్ల ఈ వానాకాలంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ డైరెక్టర్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రం వైపు వేగంగా వస్తున్నాయి. ఈసారి కేరళలోకి మూడు రోజులు ముందుగానే అవి ప్రవేశించాయి. ప్రస్తుతం కర్నాటక, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రెండుమూడు రోజుల్లో కర్నాటకలోని కొంకన్, గోవా ప్రాంతాలకు చేరే అవకాశముంది. జూన్ 5న దక్షిణ రాయలసీమకు, 7 నుంచి 10వ తేదీ మధ్యలో కోస్తాంధ్ర, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నట్టు భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.