Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కౌలు రైతుల రాష్ట్ర సదస్సు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల ఐదో తేదీన జరుగుతుందనీ, అక్కడ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రకటించారు. ఆ సదస్సును కౌలురైతులంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులున్నారనీ, 30 శాతం వ్యవసాయం వారి ద్వారానే సాగవుతున్నదని వివరించారు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం వారికి రుణార్హత కార్డులివ్వాలన్నారు. కానీ, రాష్ట్ర సర్కారు వారికి కార్డుల్విడం లేదనీ, ఫలితంగా వారు రుణాలు పొందలేకపోతున్నారని చెప్పారు. రైతు బీమా, రైతుబంధు పథకాలు వర్తించట్లేదనీ, చివరకు పంటను అమ్ముకుందామన్నా సరైన రేటు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థాగత రుణాలు లభించకపోవడం వల్లనే ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్య ల్లో సగానికిపైగా కౌలు రైతులవేనన్నారు. వారి కుటుంబాలకు ఏ రకమైన సహకారం కూడా అందట్లేదన్నారు. కౌలు రేటు కూడా భూమి యజమానులు నిర్ణయించిన విధంగా చెల్లించాల్సి వస్తున్నదని తెలిపారు. భూమి స్వభావాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వమే కౌలు రేటును నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్‌రావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తదితరులు పాల్గొన్నారు.