Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు
- మతకల్లోహాలు సృష్టించేలా బండి సంజరు వ్యాఖ్యలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
నవతెలంగాణ-కొమురవెల్లి
దేశంలో మతోన్మాద ఏజెండాను బీజేపీ ప్రోత్స హిస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొమురవెల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో రెండవ రోజు మంగళవారం జరిగిన జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డితో కలిసి మాట్లాడారు. మోడీ ప్రభుత్వంలో ప్రభుత్వరంగ సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయని, అత్యధిక ప్రజలు ఆదరిస్తున్న ఎల్ఐసీ లాంటిని కార్పొరేట్, విదేశీ సంస్థలకు కట్టబెట్టే విధానాలు తెచ్చారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ విధానం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాకుండా, కార్పొరేట్ కంపెనీల్లో తాత్కాలిక పని విధానాన్ని ప్రవేశపెట్టి కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని తెలిపారు. రాష్ట్రంలో బండి సంజరు వ్యాఖ్యలు మత కల్లోలాలను సృష్టించే విధంగా ఉన్నాయన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూ బీజేపీ వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోడీపై యుద్ధం ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకుని తన చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఐదు రకాల జీఓలను అమలు చేయకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని, వెంటనే కొత్త జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వడ్లు కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం చేతులెత్తేసిందని, పేరుకే కొంటున్నట్టు నటిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దేశంలో అత్యధికంగా ఉన్న పేద బడుగు బలహీన ప్రజల కోసం ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టిపల్లి సత్తిరెడ్డి, కాముని గోపాల స్వామి, దాసరి కళావతి, గోడ్డు బర్లభాస్కర్, సందర బోయిన ఎల్లయ్య, సర్పంచ్లు చెరుకు రమణారెడ్డి, తాడూరి రవీందర్, పార్టీ సీనియర్ నాయకులు నక్కల యాదవరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కిష్టారెడ్డి, సనాది భాస్కర్, అత్తినీ శారద, తదితరులు పాల్గొన్నారు.