Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉద్యోగాలు వీడి వ్యవసాయం చేస్తున్నారు
- రైతుకు మేలు చేసే పంటలు సాగు చేసుకోవాలి : మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు
నవతెలంగాణ-గజ్వేల్
తెలంగాణలో సర్కారు ఉద్యోగికి ఎంత డిమాండ్ ఉందో రైతుకు అంతే డిమాండ్ ఉందని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి. ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన వ్యవసాయ అధికారులు, రైతు సమితి సభ్యులు, కోఆర్డినేటర్లతో మంగళవారం ఖరీఫ్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు వీడి వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్నారన్నారు. వచ్చే వానాకాలం ఏ పంటలు వేస్తే రైతులకు మేలు జరుగుతుందో అధికారులు ఆలోచించి రైతులకు సూచనలు చేయాలన్నారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే అంబలి కేంద్రాలు, రైతుల ఆత్మహత్యలు, ధర్నాలు, ఆందోళనలు ఉండేవనీ, కానీ ఐదేండ్లలో మార్పు తెచ్చామని, ఇప్పుడు ఏ మూలకు వెళ్లిన ధాన్యపుసిరులు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పుడు రైతు డిక్లరేషన్ అంటున్న పార్టీలు.. వారి హయాంలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, కష్టాలు, కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక పథకాలు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు. రైతు బీమా అంటే ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు. కానీ రైతు బీమా రైతు ఏ ప్రమాదంతో మరణించినా అందిస్తున్నామని తెలిపారు. అత్యధికంగా రైతు ఆత్మహత్యలను తగ్గించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని కేంద్రమే చెప్పిందని వారు గుర్తు చేశారు. నల్లచట్టాలు తెచ్చి రాష్ట్రానికి రావలసిన రూ.25 వేల కోట్లను కేంద్రం ఇవ్వడం లేదన్నారు. ఆయిల్ పామ్ సాగు వల్ల వచ్చే లాభాలను రైతులకు వివరించారు. ఆయిల్ పామ్, సెరికల్చర్ సాగు లాభాదాయకంగా ఉంటుందన్నారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో కనీసం 25 వేల ఎకరాల చొప్పున విత్తన సాగు చేపట్టాలన్నారు. ప్రధానంగా పచ్చి రొట్ట విత్తనాల సాగు పెంచాలని తెలిపారు. ఇతర పంటలకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. ములుగు రీసెర్చ్ సెంటర్లో మిరపసాగు నారు పెద్ద ఎత్తున అందించాలన్నారు. గజ్వేల్, మెదక్‌లో రాక్ పాయింట్ ఏర్పాటు చేయించి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ మంత్రిని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు హనుమంతరావు, హరీష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాలకిషన్, ఎఫ్డీపీ చైర్మెన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, జడ్పీ చైర్మెన్లు రోజా శర్మ, హేమలత, రైతు సమితి అధ్యక్షులు నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్లు మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, సోములు, గడ స్పెషల్ అధికారి ముత్యంరెడ్డి, డీసీసీబీ అధ్యక్షులు చిట్టి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.