Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్‌లో అడుగుపెట్టొద్దన్న ఆంక్షలపై ఆగ్రహజ్వాల
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- విలేకరులు
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న పేదలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు.. స్థానిక నాయకుల అక్రమ అరెస్టుపై నిరసన వెల్లువెత్తింది. అలాగే, మళ్లీ వరంగల్‌లో అడుగు పెట్టొద్దంటూ పోలీసులు షరతులు పెట్టడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రోడ్లపైకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. హైదరాబాద్‌లో పెద్దఎత్తున నిరసన తెలిపారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, జిల్లా కార్యదర్శి ఎండీ.జబ్బార్ ఆధ్వర్యంలో నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బల్మూరు మండల కేంద్రంలో కూడా నిరసన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.వెంకటస్వామి ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. వడ్డేపల్లి మండల కేంద్రంలో కూడా నిరసన తెలిపారు.
ఖమ్మ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. రూరల్ మండలంలో కాచిరాజ్గూడెంలో కురవి- ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. వైరాలో ఖమ్మం - కొత్తగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎర్రుపాలెంలో సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి రింగ్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. భద్రాచలంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇల్లందులో దిష్టిబొమ్మ దహనం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు దాసరి రాజేశ్వరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జన్నారం, తాండూరు మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మందమర్రిలో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. నాయకుల అరెస్టులను నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో తీవ్రంగా ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని వాగ్దానం చేసి విస్మరించిందన్నారు. వరంగల్‌లో దాదాపు 25 వేల మంది పేదలు గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తుంటే పోరాటానికి మద్దతుగా వెళ్తున్న రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను అరెస్టు చేయడం.. ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. రామన్నపేట మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో దంతాలపల్లి-సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. హుజూర్‌నగర్‌లో పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కోదాడ పట్టణంలో రాస్తారోకో చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలో సుభాష్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.