Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ పోరాటానికి సంఘీభావం తెలపటానికి వెళ్తుండగా సీపీఐ(ఎం)
రాష్ట్ర కార్యదర్శిని అడ్డుకున్న పోలీసులు
- రాష్ట్ర వ్యాప్తంగా భగ్గుమన్న నిరసనలు
- వరంగల్‌లో అడుగుపెట్టొందంటూ ఆంక్షలు
- హన్మకొండ కలెక్టరేట్ వద్ద గుడిసె వాసుల ధర్నా
చట్టం సర్కారుకు చుట్టమైంది. రాజుకో నీతి...పేదకో నీతి అని నిర్వచించింది. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బడా బాబులు అక్రమించుకుంటే, ప్రత్యేక జీవోలు ఇచ్చి వాటిని క్రమబద్ధీకరించే ప్రభుత్వం, పేదలు 30 గజాల స్థలాన్ని ఇవ్వమని అడిగితే 'ఆక్రమణదారులు' ముద్రవేసి, బుల్డోజర్లతో కూల్చివేసి, ఇండ్లకు నిప్పుపెట్టి నానా బీభత్సం సృష్టించింది. ప్రభుత్వం తాను చేసిన చట్టాలను తానే ఉల్లంఘించింది. పోలీసు వ్యవస్థ కూడా సర్కారుకు 'జీ హుజూర్' అంటూ సలాం కొట్టి, పై నుంచి వచ్చిన ఆదేశాలనే అమలు చేసింది. పేదల భూపోరాటానికి సంఘీభావం తెలిపినందుకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను అరెస్టు చేసింది. ఆయనతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ కూడా అరెస్టు అయ్యారు. ఈ ఘట్టానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికైంది. ఖమ్మం నుంచి వరంగల్‌కు వస్తున్న తమ్మినేని వీరభద్రంను పోలీసులు రాయపర్తి వద్దే అడ్డుకొని అరెస్టు చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు పాలకుర్తి పోలీసుస్టేషన్లో నిర్భంధించారు. ఆ తర్వాత కూడా ఆయన నేరుగా ఖమ్మంకు వెళ్లిపోవాలే తప్ప, తిరిగి వరంగల్ వెళ్లడానికి వీల్లేదనే షరతు విధించారు. ఆయన వెంట పోలీసు కానిస్టేబుళ్లను పంపి, ఖమ్మంకు తిప్పిపంపారు. ఈ చర్యను రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) పార్టీతో పాటు ప్రజాసంఘాలు, కార్మికులు, కర్షకులు, శ్రమజీవులు, మహిళాసంఘాలతో సహా అంతా ముక్తకంఠంతో ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగులబెట్టి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు, ఆందోళనలు చేస్తే దగ్గరుండి బందోబస్తు నిర్వహించిన పోలీసులు, తాము పేదల పక్షాన భూపోరాటం చేస్తే అరెస్టులు ఎలా చేస్తారని నిలదీశారు. ఇలాంటి నిర్భంధాలతో పోరాటాలు మరింత ఉధృతం అవుతాయే తప్ప, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
వరంగల్ జిల్లాలో ముందు రోజు రాత్రి నుంచే ఇండ్లలో నిద్రిస్తున్న సీపీఐ(ఎం) నేతల్ని ముందస్తు భద్రత పేరుతో అరెస్టులు చేసి, పోలీసు స్టేషన్లకు తరలించారు. జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి, టీ ఉప్పలయ్య, పుల్ల అశోక్ సహా అనేకమందిని అరెస్టులు చేశారు. వీరంతా చేసిన నేరం...గుడిసెవాసులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరడమే! ఆ డిమాండ్ సాధన కోసం హన్మకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించడమే...ఈ మాత్రానికే ప్రభుత్వం ఉలిక్కిపడింది. పేదల డిమాండ్‌ను తొక్కిపెట్టి, తాము భూబకాసురుల పక్షమే అని చెప్పకనే చెప్పేసింది...
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 25 రోజులుగా గుడిసెవాసులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపడానికి వరంగల్ వస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ను బుధవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి పోలీసులు ఖమ్మం నుంచి వరంగల్‌కు వస్తుండగా అరెస్టు చేశారు. అనంతరం వారిని పాలకుర్తికి తరలించారు. వరంగల్‌లో కాలుపెట్టొందంటూ లాంటి షరతులతో సాయంత్రం విడుదల చేశారు. వరంగల్ నగరంలో బెస్తంచెరువు, జక్కలొద్ది, ఉర్సుగుట్ట, ఖిలా వరంగల్ ప్రాంతాల్లో సీపీఐ(ఎం) నాయకత్వంలో జరుగుతున్న భూ పోరాటానికి మద్దతు తెలపడానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని రానుండటంతో వ్యూహాత్మకంగా పోలీసులు రాయపర్తిలోనే అడ్డుకొని అరెస్టు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) జిల్లా కమిటీ నేతృత్వంలో జరగనున్న గుడిసెవాసుల ధర్నాలో పాల్గొనాల్సి ఉంది. హన్మకొండ కలెక్టరేట్ ముందు భారీ ప్రదర్శనతోపాటు 2 గంటలపాటు నిరుపేదలు మండుటెండలో పెద్దఎత్తున ధర్నాకు దిగారు. వరంగల్ జిల్లా కేంద్రంలో బెస్తంచెరువు, జక్కలొద్దిలలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జి. రాములు, జగదీశ్, జిల్లా కార్యదర్శి సిహెచ్. రంగయ్య పాల్గొని గుడిసెవాసుల పోరాటానికి మద్దతు పలికారు. రెండు గంటలపాటు హన్మకొండ-హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 రోజులుగా ఎర్రజెండా నీడన పేదలు ఇండ్ల స్థలాలకై పోరుబాట పట్టారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటంలో పాల్గొనటానికి వచ్చే జిల్లా నాయకులు, కార్యకర్తలను బుధవారం తెల్లవారుజామునుంచే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అరెస్టులు చేసినా ఉద్యమాన్ని ఆపేదిలేదని పేదలు ఉదయాన్నే కలెక్టరేట్‌కు చేరుకొని పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. అడుగడుగునా సీపీఐ(ఎం) నేతలకు నిరుపేదలు జేజేలతో స్వాగతం పలికారు. బతుకమ్మలతో మహిళలు నేతలను ఆహ్వానించారు. తమ పోరాటాన్ని ప్రభుత్వం అడ్డుకొని అరెస్టులు చేసి జైళ్లకు పంపినా పోరాటాన్ని అపేదిలేదని ప్రజలు పెద్దఎత్తున నినదించారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు : జి. రాములు
సీపీఐ(ఎం) నేతలను అరెస్ట్ చేసి గుడిసెవాసుల ఉద్యమాన్ని ఆపలేరని ఆపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జి. రాములు అన్నారు. పేదలు తమకు ఇండ్ల స్థలాలు కావాలని పోరాడుతున్న తీరును వరంగల్ బెస్తం చెరువులో మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభినందించారు. మీ పోరాట పటిమను చూడటానికే ఇక్కడకు వచ్చామని, మీరంతా స్థలాలు సాధించే వరకు పోరాటం ఆపేదిలేదని పిలుపునిచ్చారు. మీ పోరాటానికి మద్దతునివ్వడానికి వస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ అణచివేత చర్యలు మానుకోకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరూ అధైర్యపడకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలో ఎస్ఆర్ నగర్, ఎసిరెడ్డినగర్లో నిరుపేదలకు ఇండ్ల స్థలాలు దక్కాయంటే పెద్ద పోరాటం చేయడం వల్లనే సాధ్యమైందన్నారు. మనం పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పా మనకు ఇండ్ల స్థలాలు దక్కవని తెలిపారు. పేదలకు ప్రభుత్వ స్థలంలో స్థలాలు ఇచ్చి పట్టాలివ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
నిర్బంధాన్ని మానుకొని పేదలకు పట్టాలివ్వాలి : సిహెచ్. రంగయ్య
ఇండ్ల స్థలాల కోసం పేదలు శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం నిర్బంధాన్ని విధిస్తుందని, ఇకనైనా నిర్బంధాన్ని మానుకొని స్థలాలిచ్చి పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్.రంగయ్య డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలో 18-20 వేల మంది పేదలు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో గుడిసెలు కనపడొద్దని, అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇంత వరకు ఇవ్వలేదన్నారు. పోరాటం చేస్తున్న వారిని అణిచివేయాలని చూస్తే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. అక్రమంగా సీపీఐ(ఎం) నేతలను వేకువజామునుంచే అరెస్టు చేశారని, వారందరినీ వెంటనే విడుదల చేయాలన్నారు.
మన పోరాటం ఆగదు.. : జగదీశ్
పేద ప్రజల పక్షాన పార్టీ పోరాటం చేస్తుంటే.. దాంట్లో పాల్గొనటానికి వచ్చిన సీపీఐ(ఎం) నేతలను అరెస్ట్ చేయడం అన్యాయమని రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్ అన్నారు. ఈ అరెస్ట్‌లకు భయపడేదే లేదని, జైళ్లకు పోవడానికి సిద్ధంగా ఉన్నారా అని జగదీశ్ ప్రజలను ప్రశ్నిస్తే.. సిద్ధంగా ఉన్నామంటూ గుడిసెవాసులు పెద్దపెట్టున నినదించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు వస్తున్నారంటేనే ప్రభుత్వం భయపడిపోయి నగరంలో అరెస్ట్ చేయడం ప్రారంభించిందన్నారు. ఈ అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తున్నామన్నారు. నిరుపేదలకు ఇండ్లస్థలాలు ఇచ్చి పట్టాలివ్వాలని 25 రోజులుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు బాబు, జిల్లా కమిటీ సభ్యులు అరూరి కుమార్, నాయకులు చుక్క ప్రశాంత్, లక్క రమేష్, కార్యదర్శులు మైరున్నిసా, చందు, మాధవి, రామసందీప్, సురేష్, గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు : బొట్ల చక్రపాణి
నెల రోజులుగా పేదలు వేసుకున్న గుడిసెలను తొక్కించి, కాల్చివేయడం, ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడంతో ఉద్యమాన్ని ఆపలేవని ఆపార్టీ హన్మకొండ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి అన్నారు. కలెక్టరేట్ ముందు ధర్నాలో మాట్లాడుతూ.. గోపాలపురం చెరువులో 20 ఎకరాల భూమికి నేడు 9 ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు. 11 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందన్నారు. కోట చెరువుల కింద 53 ఎకరాలుంటే ఆరెకరాలు అన్యాక్రాంతం కాగా, 20 ఎకరాల్లో మట్టిని తవ్వి ఇటుక బట్టీల కోసం అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని అన్నారు. బంధం చెరువులో 21 ఎకరాలలో 6 ఎకరాలు అన్యాక్రాంతమైందన్నారు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖాల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాకుండా నిరుపేదలకు ఇచ్చి పట్టాలివ్వాలన్నారు. తొలుత భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు బొట్ల చక్రపాణితోపాటు వాంకుడోతు వీరన్న, రాగుల రమేశ్, మంద సంపత్, డి. భానునాయక్, డి. తిరుపతి, ఎండి మిశ్రిన్ సుల్తానా, గాద రమేశ్, తొట్టె మల్లేశం, ఎం. చుక్కయ్య, జి. ప్రభాకర్‌రెడ్డి, గొడుగు వెంకట్, బండి పర్వతాలు తదితరులు వినతిపత్రం సమర్పించారు.
సీపీఐ(ఎం) నేతల ముందస్తు అరెస్ట్‌లు
వరంగల్‌లో గుడిసెవాసుల సమావేశంలో పాల్గొననున్న వరంగల్ జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నలిగంటి రత్నమాల, ముక్కెర రామస్వామి, టి. భవాని మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. హన్మకొండ కలెక్టరేట్ వద్ద సీపీఐ(ఎం) ధర్నాను విఫలం చేయడానికి పోలీసులు వేకువజామున సీపీఐ(ఎం) నేతలు ఎం. చుక్కయ్య, టి. ఉప్పలయ్య, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న ఇండ్లలో సోదాలు చేశారు. చుట్టున్న ఇండ్ల నుంచి పార్టీ కార్యకర్తలు వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో పోలీసులు తిరిగివెళ్లిపోయారు. ఈ క్రమంలో పార్టీ కార్యాలయానికి బయలుదేరిన టి. ఉప్పలయ్య తదితరులను అరెస్ట్ చేసి పోలీసు హెడ్ క్వార్టర్‌కు అక్కడి నుండి ధర్మసాగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. జిల్లా నాయకులు సారంపల్లి వాసుదేవరెడ్డిని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంత మంది నేతలను హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.