Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు
- పలువురి నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతి మనిషి మరణించక తప్పదు. అయితే కొందరి మరణం అనేక మందిని కలచివేస్తుంది. ప్రజలకు సేవ చేస్తూ వారితో మమేకమైన వారి జీవితమే అందుకు కారణం. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శ్యామలాంబ. ఆమె అంత్యక్రియలను బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. శ్యామలాంబ భర్త బసవరావు, ఆమె కుమారుడు కె.మధుసూదన్, కుమార్తెలు కె.మధుమతి, డాక్టర్ కె.మాధవి అంతిమసంస్కారాలను జరిపించారు. ప్రజలకు, ముఖ్యంగా రోగులకు ఆమె అందించిన సేవలను పలువురు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వైద్యం వ్యాపారంగా మారి డబ్బున్నోడికే చికిత్స అన్నట్టుగా మారిన ఈ కార్పొరేట్ కాలంలోనూ శ్యామలాంబ పేద రోగుల పట్ల దయకలిగి ఉండేవారని చెప్పారు. ఏనాడు డబ్బుతో నిమిత్తం లేకుండా ప్రతి రోగి కోలుకునేంత వరకు అండగా నిలిచారని నివాళులర్పించారు. పిల్లల వైద్యురాలిగా తమ పిల్లలకు ఆమె అందించిన చికిత్సను, ఆమె చూపించిన మానవత్వాన్ని స్మరించుకున్నారు. ఆమె మంచి స్నేహశీలిగా ఉండేవారని పలువురు పేర్కొన్నారు. ఆమె మరణం జీర్ణించు కోలేకపోతున్నామనీ, ఒక మంచి ప్రజా వైద్యురాలిని కోల్పోయామని అంత్యక్రియలకు హాజరైన వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డీ.జీ.నర్సింహారావు, టి.జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇన్‌ఛార్జి బుచ్చిరెడ్డి, సీపీఐ (ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, జూబ్లిహిల్స్ నియోజకవర్గ నాయకులు చంద్రశేఖర్‌రావు, నవతెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్ టీఎన్వీ. రమణ తదితరులు హాజరై నివాళులర్పించారు. బంధుమిత్రులు, డాక్టర్లు అంత్య క్రియల్లో పాల్గొన్నారు.