Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు
- ప్రధాని మోడీ, అమిత్‌షా, గడ్కరీతో పాటు కీలక నేతల రాక
- ఏ చిన్న అవకాశాన్నీ వదలని వైనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు సంబంధించి నాలుగైదు నగరాల పేర్లు తెరపైకి వచ్చినా హైదరాబాద్‌వైపే మొగ్గుచూపింది. జూలై 2,3 తేదీల్లో ఇక్కడ ఆ సమావేశాలను నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. వీటికి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా, అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలందరూ హాజరుకానున్నారు. వాటిలో త్వరలో జరగనున్న గుజరాత్, తదితర రాష్ట్రాల ఎన్నికలతోపాటు తెలంగాణలో బలపడేందుకు దోహదపడే అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిసింది. సమావేశాల్లో పాల్గొనేందుకు విచ్చేసే మోడీ రాజ్‌భవన్‌లో రెండు రోజుల పాటు బస చేయనున్నట్టు సమాచారం. సమావేశాల నిర్వహణకు హెచ్ఐసీసీ, తాజ్‌కృష్ణ, నోవాటెల్, పలు హోటళ్లు, కన్వెన్షల పేర్లను బీజేపీ రాష్ట్ర నేతలు పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే ఆ పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. నిర్వహణ వేదిక ఎంపిక కోసం రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యనేతలైన విజయశాంతి, జితేందర్‌రెడ్డి, వివేక్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దక్షిణాదిలో ఒక్క కర్నాటకలోనే అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళలో పాగా వేసేందుకు ఎంత ప్రయత్నించినా అక్కడి ప్రజల చైతన్యపూరితమైన ఆలోచనలతో ఆ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో చోటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో ఉన్న తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ప్రతి అంశాన్నీ వదలకుండా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది. నెల వ్యవధిలోనే బీజేపీ కీలక నేతలైన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రుల పర్యటనలు ఇదే అంశాన్ని నొక్కి చెబుతున్నాయి. వీరంతా కేసీఆర్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్‌ది కుటుంబ, అవినీతి పాలన అంటూ పదేపదే ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్గాలను ఏవిధంగానైనా తమ వైపు తిప్పుకోవాలనే ఎత్తుగడను అవలంబించిస్తున్నది. దాని కోసం ప్రత్యేకంగా కమిటీలు వేసి మరీ ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిపై కేంద్రీకరించి పనిచేస్తున్నది. వాటిని ఇన్‌చార్జీలనూ నియమించింది. గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన లక్ష్మణ్‌ను యూపీ నుంచి రాజ్యసభకు పంపింది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని చేరదీసి టీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు కూడా యత్నిస్తున్నది. అందులో భాగంగానే జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవమైన గురువారం నాడు తెలంగాణ ఉద్యమ కారులను చేరదీసి రోజంతా ప్రత్యేకంగా చర్చించేందుకు నగర శివారులోని జె.కన్వెన్షన్(జిల్లా బాలకృష్ణారెడ్డిది)ను వేదికగా ఎంచుకున్నది. యువతను ఆకట్టుకునే పనిలో భాగంగా విద్వేషపూరిత ప్రసంగాలకూ బీజేపీ నేతలు వెనుకాడటం లేదు. అందుకు తాజాగా బండి సంజరు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. లౌకిక శక్తులు, ప్రజాతంత్ర శక్తులు బీజేపీ ఎత్తుగడలను తిప్పకొట్టేందుకు ముందుకు రాకపోతే భవిష్యత్ బీజేపీ పాగా వేసే ప్రమాదం పొంచి ఉన్నది.