Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో నియామకమైన పీజీటీ టీచర్ ఎ శారదను ఎస్సీఈఆర్టీ లెక్చరర్‌గా విలీనం చేయడాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం (జీటీఏ) ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో నియామకం చేయాల్సిన పోస్టులను దొడ్డిదారిలో, అడ్డదారిలో చట్టవ్యతిరేకంగా విలీనం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. 30 ఏండ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను ఎఫ్ఏసీ, డిప్యూటేషన్లు,అబ్జార్బ్షన్, రెగ్యులరైజేషన్ పేరుతో భర్తీ చేయడం సరైంది కాదని విమర్శించారు. దీన్ని ఏ చట్టం ఒప్పుకుంటే చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తిని, చట్టాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు.
అక్రమ పోస్టింగ్‌ను రద్దు చేయాలి : డీటీఎఫ్
రంగారెడ్డి జిల్లాలోని మోడల్ స్కూల్లో పీజీటీగా పనిచేస్తున్న టీచర్‌ను ఎస్సీఈఆర్టీలో శాశ్వత ప్రాతిపదికన లెక్చరర్‌గా అక్రమంగా నియమించిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం రఘుశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సర్వీసు నిబంధనల పెండింగ్ పేరుతో 15 ఏండ్లుగా పర్యవేక్షక పోస్టులు భర్తీ చేయని ప్రభుత్వం ఏకంగా ఒక సొసైటీకి చెందిన నాన్ గెజిటెడ్ టీచర్‌ను ఉప విద్యాధికారి హోదా కలిగిన సీనియర్ లెక్చరర్‌గా నియమించడంలో ఆంతర్య ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్ విడుదల చేయకుండా దొడ్డిదారిలో ఓ ఉపాధ్యాయురాలికి సిద్ధిపేట నుంచి మేడ్చల్ మల్కాజిగిరికి అంతర్జిల్లా బదిలీకి చర్యలు చేపట్టడం సరైంది కాదని తెలిపారు.