Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ బాధ్యత వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న కేంద్ర హౌంమంత్రి అమిత్ షాపై ఉందని గుర్తుచేశారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఆయన రాష్ట్రంలోని వివిధ మార్కెట్ కమిటీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రం అవతరించి ఎనిమిదేండ్లు గడిచినా విభజన చట్టంలోని హామీలు ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఐటీఐఆర్‌ను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, మెగా పవర్ టెక్స్టైల్ క్లస్టర్ సంస్థల ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించకపోవటం, నిజామాబాద్‌లో పసుపు బోర్డు మంజూరు చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులివ్వకపోవటం, హైదరాబాద్‌కు మంజురైన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించడం, దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న కేంద్రం అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం తదితరాంశాలు రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు.