Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితీ సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రముఖ కథా రచయిత, నవలాకారుడు, చిత్రకారుడు, కవి శీలా వీర్రాజు(83) కన్నుమూశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. శీలా వీర్రాజు 1939 ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించారు. 1961లో హైదరాబాదు నుంచి వెలువడే కృష్ణాపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరి రెండేండ్లు పనిచేశారు. 1963లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాదకుడిగా చేరి 1990లో స్వచ్ఛంద పదవీవిరమణ చేశాడు. ఆయన చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.
కళాశాల విద్యనభ్యసించే సమయంలోనే ఆయన కథలు రాయడం ప్రారంభించారు. సాహితీ మిత్రులు ఆయన్ను శీలావీగా పిలుచుకుంటారు. సమాధి, మబ్బు తెరలు, వీర్రాజు కథలు, హ్లాదిని, రంగుటద్దాలు, పగా మైనస్ ద్వేషం, వాళ్ల మధ్య వంతెన, మనసులోని కుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది, శీలా వీర్రాజు కథలు అనే కథాసంపుటాలను వెలువరించారు. వెలుగురేఖలు, కాంతిపూలు, కరుణించని దేవత, మైనా అనే నవలలను ఆయన రాశారు. కొడిగట్టిన సూర్యుడు, హదయం దొరికింది, మళ్లీ వెలుగు (దీర్ఘ కావ్యం), కిటికీకన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, శీలా వీర్రాజు, బతుకుబాస (నవలా కథకావ్యం) అనే మరికొన్ని కవితాసంపుటులను వెలువరించారు. కలానికి ఇటూ అటూ అనే వ్యాససంపుటిని కూడా వెలువరించారు. శీలా వీర్రాజు మరణంపట్ల తెలంగాణ సాహితీ ప్రదాన కార్యదర్శి కె.ఆనందాచారి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.