Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది 26.14 శాతం వృద్ధి
- 4.1 లక్షల మందికి ఉద్యోగాలు
- రూ.1,83,569 కోట్ల విలువైన ఎగుమతులు
- 2021-22 ప్రగతి నివేదికను విడుదల చేసిన సందర్భంగా మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత ఎనిమిదేండ్లలో తెలంగాణ ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది జాతీయ సగటు 17.2 శాతం కంటే తొమ్మిది శాతం అధికంగా 26.14 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. ఆయా ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లని వివరించారు.
దేశంలో 4.5 లక్షల ఉద్యోగాలు వస్తే హైదరాబాద్లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉందనీ, ఎనిమిదేండ్లలో 4.1 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఈ నెల 20న టీహబ్ రెండో దశను ప్రారంభిస్తామనీ, టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీని ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్టు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రావిర్భావం నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లనీ, ప్రస్తుతం రూ.1,83,569 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఉద్యోగుల సంఖ్య నాడు 3,23,396 కాగా అది 7,78,121 అయిందని చెప్పారు.
ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన పలు సంస్థలు ముదుకొచ్చాయని తెలిపారు. గోల్డ్ మ్యాన్ సాచ్స్, వన్ ప్లస్, ప్లగ్ అండ్ ప్లే, మాస్ మ్యూచువల్, స్టెల్లియంట్స్, జెన్ పాక్ట్, కందికోయలో ఐటీ పార్కు ఏర్పాటు, అమెరికాకు చెందిన క్వాలికామ్, జర్మనీకి చెందిన బహుళ జాతి సంస్థ బోస్చ్, గూగుల్ ప్రధాన కేంద్రం తర్వాత అతి పెద్ద క్య్షాంపస్ ఏర్పాటు, హ్యూండారుతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం, జెడ్ఎఫ్ అతి పెద్ద ఇంజినీరింగ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు, ఎలక్ట్రికల్ వెహికల్ తయారీదారు ఫిస్కర్, కాల్ వే గోల్ఫ్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ కంపెనీలని గుర్తుచేశారు. అదే విధంగా ద్వితీయశ్రేణి నగరాలైన వరంగల్లో ఐటీ టవర్ సేవలను అందిస్తుండగా, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేటలో పనులు పూర్తయి ఈ ఏడాది అక్టోబర్ లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నల్లగొండలో ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు.
ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం (ఎమర్జింగ్ టెక్నాలజీస్)ను ఎప్పటికప్పుడు రాష్ట్రానికి పరిచయం చేస్తున్నామన్నారు. స్కైవే ద్వారా అత్యవసర రోగులకు మందుల సరఫరా, అగ్రిటెక్ ప్రాజెక్ట్, క ృత్రిమ మేధస్సు తదితర వాటిని వినియోగించుకుంటున్న తీరును వివరించారు.
ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 4,500 మీ సేవా కేంద్రాల ద్వారా 600కు పైగా సేవలను అందిస్తున్నామన్నారు. అవి 2.6 కోట్ల మంది పౌరులకు ఏడాదికి రూ.4,500 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించాయని తెలిపారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. టీ హబ్ ద్వారా రెండు వేల అంకుర సంస్థలు వచ్చాయని గుర్తుచేశారు. వురు హబ్తో మహిళలను, బాలికలను ప్రోత్సహిస్తున్నామన్నారు. టి వర్క్స్ ద్వారా సమస్యలకు నూతన పరిష్కారాలను చూపిస్తున్నామని వివరించారు. తెలంగాణ అకాడమీ ఆప్ స్కిల్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా నైపుణ్యశిక్షణ ఇస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్, టి-ఫైబర్, సాఫ్ట్ నెట్, డిజిటిల్ మీడియా, ఓపెన్ డాటా, ఫోటోనిక్స్ వ్యాలీ కార్పొరేషన్ తదితర సంస్థలు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.