Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాసంస్థల పనివేళలు మార్చండి
- టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్పొరేట్ స్థాయి చదువుల పేరుతో రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులపై సర్కారు కలిగిస్తున్న తీవ్రమైన మానసిక ఒత్తిడిని నివారించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. మహాత్మా జోతిరావు ఫూలే గురుకుల విద్యాలయాల సంస్థ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కన్వీనర్లు, కోకన్వీనర్ల సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రచారార్భాటంతో ఒకేసారి లెక్కకు మించి గురుకుల పాఠశాలలను అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారని చెప్పారు. విద్యార్థులు అరకొర సౌకర్యాలతోనే సతమతమవుతున్నారని విమర్శించారు. నైవాసిక విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులకూ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. కానీ గురుకులాల్లో క్వార్టర్స్ లేకపోగా కనీస విశ్రాంతి సౌకర్యాలూ లేవని ఆందోళన వ్యక్తం చేశారు. పనివేళలు మాత్రం నైవాసిక పద్ధతిలో ఉదయం 6.45 నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండాల్సి ఉంటుందన్నారు. వారంలో రెండు, మూడు రోజులు రాత్రిపూట బస (నైట్‌డ్యూటీ) కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు. హౌస్ మాస్టర్, డిప్యూటీ వార్డెన్ తదితర విధులతో బోధన కంటే బోధనేతర పనులే అధికమయ్యాయని అన్నారు. వేసవి సెలవులు కూడా వినియోగించుకోకుండా సమ్మర్ క్యాంపుల పేరుతో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. గురుకుల విద్యాసంస్థలు ఆశించిన ఫలితాలు సాధిస్తూ చిరకాలం మనగలగాలంటే ఉపాధ్యాయులను ఒత్తిడికి దూరం చేయాలని డిమాండ్ చేశారు. బోధనేతర విధులను తగ్గించాలని, పాఠశాలలకు శాశ్వత వసతి కల్పించాలని కోరారు. పాఠశాల ఆవరణలోనే ఉపాధ్యాయులకు నివాస వసతి కల్పించాలని సూచించారు. అప్పటివరకు పనివేళల్లో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం సంపాదిత సెలవులు ప్రిజర్వు చేయాలని చెప్పారు. పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఆరోగ్య కార్డులు ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్ కోశాధికారి టి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సృజన కన్వీనర్‌గా, 11 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలోఎస్ లివిన్ స్టన్, సతీష్, సురేష్, మధు, అపర్ణ, గణేష్, కరీం, బ్రహ్మచారి, రవికుమార్, భాస్కర్, యాదగిరి, జ్యోతి, శ్రావణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.