Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోడీకి ఎనిమిదేండ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్సే కలలోకి వస్తున్నట్టుందని ఎద్దేవా చేశారు. ఈమేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ప్రయివేటు ఫిర్యాదుపై నమోదు చేసిన కేసును ఎనిమిదేండ్లుగా స్వాగతిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. సోనియాగాంధీ, రాహుల్గాంధీకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బీజేపీది, బ్రిటీష్ ప్రభుత్వానిది ఒక్కటే భావజాలమని విమర్శించారు. నాడు వారి అణచివేత, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని తెలిపారు. ఇప్పుడు వారి భావజాలానికి వారసులైన బీజేపీ-మోడీ అణచివేత, కుట్రలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. నాటి స్వాతంత్య్ర సంగ్రామానికి కాంగ్రెస్ నాయకత్వం వహించిందని.. నేడు మోదీని గద్దె దింపే ఉద్యమానికి కూడా నాయకత్వం వహిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు : రేవంత్
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోనియాగాంధీ చొరవతో అరవై ఏండ్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎనిమిదేండ్ల క్రితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వందలాది మంది అమరుల త్యాగాల సాక్షిగా సాధించుకున్న రాష్ట్రంలో స్వపరిపాలన సుపరిపాలవుతుందని ఆశించిన రాష్ట్రానికి గులాబీ చీడ పట్టుకుందని పేర్కొన్నారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలిందని తెలిపారు. అమరుల త్యాగా లకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న గులాబీ చీడను తెలం గాణ నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రైతు ఆత్మహత్యలు లేని, యువతకు ఉపాధి కల్పించి, ప్రతి అవ్వ, అయ్యకు పెన్షన్ అందించి, సకల జనుల జీవితాల్లో సంబరాలు నింపడమే కాంగ్రెస్ పార్టీ స్వప్నమనీ, అందు కోసం కాంగ్రెస్ పార్టీ విశ్రమించకుండా శ్రమిస్తుందని ఆయన చెప్పారు.