Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
పక్కా సమాచారంతో ఓ గ్రామంలో తనిఖీలు నిర్వహించి 10 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను వికారాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వికారాబాద్ పోలీసుస్టేషన్లో వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి బుధవారం వెల్లడించారు. వికారాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో వికారాబాద్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, వికారాబాద్ వ్యవసాయ అధికారి పాండురంగన్ బృందంగా ఏర్పడి పక్కా సమాచారం మేరకు మంగళవారం రాత్రి వికారాబాద్ మండలం సిద్దులూర్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. సిద్దులూర్ బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానస్పదంగా మోటారు సైకిల్‌పై ఒక ప్లాస్టిక్ సంచి పెట్టుకుని ఉండగా అతన్ని పట్టుకుని సోదా చేశారు. అతని వద్ద ఉన్న సంచిలో లూజు పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం సంఘం కుర్దు గ్రామానికి చెందిన గంజిపల్లి శ్రీనివాస్‌గా గుర్తించారు. అతని వద్ద పత్తి విత్తనాలకు సంబంధించిన ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో అతని స్వగ్రామమైన సంగెంకుర్దులో తన ఇంటి వద్ద సోదా చేశారు. ఇంట్లో నిల్వ ఉంచిన అందజా 10 క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాల 20 బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ విత్తనాలు కొడంగల్, మహబూబ్‌నగర్‌కు చెందిన రఘు, కృష్ణ చౌదరి వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. తాండూర్, వికారాబాద్ ప్రాంతాలలో రైతులకు నమ్మించి వారికి ఎక్కువ ధరకు అమ్మి రైతులను మోసం చేస్తున్నట్టు వివరించారు. పట్టుబడిన 10 క్వింటాళ్ళ 20 కిలోల నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారుగా రూ. 12లక్షల24వేలు ఉంటుందని ఎస్పీ వివరించారు. పత్తి విత్తనాలు సరఫారా చేసే రఘు, కృష్ణచౌదరి పరారీలో ఉన్నారు. శ్రీనివాస్‌పై ఇంతకు ముందు కూడా యాలాల, కరణ్‌కోట్ పోలీసుస్టేషన్లో కేసులు ఉన్నాయి. నకిలీ విత్తనాలను అమ్మడం, వాటిని తయారు చేయడం, అందుకు సహకరించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటేశం, పట్టణ సీఐ రాజశేఖర్ పాల్గొన్నారు.