Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమే నిధులను విడుదల చేయడం లేదు : పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- రూ.34 వేల కోట్ల బకాయిలను ఇప్పించండి
- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
నవ తెలంగాణ-సిద్దిపేట
ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో సర్పంచులందరూ పాల్గొని సీఎం కేసీఆర్ సూచించిన ప్రణాళికలను అమలు చేద్దామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. బుధవారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావుతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ సర్పంచ్‌లు తప్పుడు లెక్కలు చూపుతూ పేపర్లకు పల్లె ప్రగతిపై ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతినెలా కేంద్రం నుంచి రూ.256 కోట్లు, రాష్టం నుంచి రూ.256 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1,31,943 చెక్కులకు రూ.571 కోట్లను విడుదల చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎనిమిది నెలల వరకు ఫండ్స్ రిలీజ్ చేసేది కాదని, ఇప్పుడు తరచుగా అధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి డబ్బులు తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రెండు నెలలకు ఒకసారి కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని, తమ వద్దకు వచ్చిన చెక్కులకు ఫండ్స్ ఆపడం లేదన్నారు. ఉపాధి హామీలో దేశంలోనే మనం నెంబర్ వన్‌లో ఉన్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ద్వారా 20 గ్రామ పంచాయతీలకు అవార్డులు అందిస్తే అందులో 19 తెలంగాణకు చెందిన గ్రామాలు ఉన్నాయని తెలిపారు. సర్పంచులకు నిధులు విడుదల చేయడం లేదని కరెక్ట్ కాదని, వారు సరిగ్గా రికార్డు చేయకపోవడం, క్వాలిటీ అధికారులతో చెక్ చేయించుకోకపోవడం.. తదితర కారణాలతోనే బిల్లులు ఆగాయి తప్ప తమ వద్దకు వచ్చిన చెక్ డబ్బులు ఆపలేదన్నారు. సర్పంచులు అంటే తమకు గౌరవం ఉందని, వారి జీతాలు పెంచామన్నారు. వారు చెప్పిన విధంగా చట్టాలు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కోసం నిధులను విడుదల చేస్తున్నారని తెలిపారు.
మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తూప్రాన్ వద్ద ఒక సర్పంచ్ ప్లకార్డుతో నిరసన తెలిపాడని, ఆ సర్పంచ్ గ్రామంలో రూ.7 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, 7 పైసలు కూడా పెండింగ్‌లో లేవని తెలిపారు. కేవలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుని వల్లనే ఆయన ఆ విధంగా చేశాడని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతమైన పథకమని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, నర్సీలున్న గ్రామాలు ఒక్క తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడున్నాయని అడిగారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉండేది కాదని, ఎండా కాలం వస్తే నీటి సమస్య ఉండేదని, 70 ఏండ్లుగా కాని పనిని రెండు మూడేండ్లలో చేసుకున్నామన్నారు. ఈ రోజు వరకు పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద రూ.700 కోట్లు చెల్లించామన్నారు. వారం రోజుల పనులవే పెండింగ్ ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి కేంద్రం నుంచి ఉపాధి హామీ కింద రావాల్సిన రూ.1200 కోట్లు, మరో రూ.8995కోట్లు కూడా బకాయిలు ఉన్నారని, బండి సంజరు కేంద్రానికి లేఖ రాసి నిధులు తెప్పించాలని సూచించారు. 99.98 శాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు తెలంగాణలో ఉంటే, దేశంలో ఏ రాష్ట్రం దరిదాపుల్లో లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో 50 శాతం కూడా దాటలేదన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డయేరియా, విషజర్వారలతో పల్లెలు వణికిపోయేవని, ఇవాళ ఆ పరిస్థితి లేదని తెలిపారు. ఈ విడత పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు.