Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాపరుల ఎక్స్‌గ్రేషియా పెంచాలి
- పెన్షన్, గుర్తింపు కార్డులివ్వాలి: జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్ష,
కార్యదర్శులు కిల్లే గోపాల్, ఉడుత రవీందర్
- మహాసభ ముగింపులో రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ- భువనగిరిరూరల్
నగదు బదిలీ ద్వారా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కిల్లే గోపాల్, ఉడుత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర మహాసభ ముగింపు సందర్భంగా మూడోరోజు బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని పాత వివేరా హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాసభలో 13 తీర్మానాలు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 7,31,368 మంది గొల్ల కురుమలను లబ్దిదారులుగా ఎంపిక చేసి ఇప్పటివరకు 3,91,388 ఎనిమిది మందికిగాను 82లక్షల19వేల 148 గొర్రెలను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇంకా 3,39,980 మందికి గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. సగం మందికి గొర్రెలు రావాల్సి ఉందన్నారు. ఈ పథకం వల్ల ఎక్కువగా డాక్టర్లు, దళారులే లాభపడ్డారని, లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పారు. ప్రభుత్వం అక్రమాలకు తావులేకుండా ఈ పథకాన్ని నగదు బదిలీ పథకంగా మార్పు చేయాలన్నారు. గొర్రెలకు మేత వనరులు కల్పించాలన్నారు. 559,1016 జీవోలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవోల అమలుకు ఫారెస్ట్ పశుసంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ ఉద్యోగుల శాఖ అధికారులతో కలిపి కోఆర్డినేట్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రతి జిల్లాకు ఒక ఒక మార్కెట్ నిర్మాణం చేయాలని కోరారు. గొర్రెల కాపరులకు ఎక్స్‌గేషియా లక్ష నుంచి ఆరు లక్షలకు పెంచుతామని సీఎం ప్రకటించి, ఆరు నెలలు గడుస్తున్నా అమలు కావడం లేదన్నారు. సొసైటీ సభ్యులుతో నిమిత్తం లేకుండా వృత్తి నిర్వహణలో మరణించిన వారందరికీ ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. గొర్రెల పంపిణీ ప్రారంభానికి ముందు జియో ట్యాగింగ్‌తో గొర్రెలకు ఇన్సూరెన్స్ కల్పిస్తామని వాగ్ధానం చేసి, అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల్లో 40,000 చనిపోయినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారని, వాస్తవ లెక్కలు అంతకంటే రెట్టిం పయ్యే అవకాశముందని అన్నారు. గొర్రెలు చనిపోయి నప్పుడు ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్న నిబంధనలు తొలగించాలని కోరారు. చనిపోయిన ప్రతి ఒక్క గొర్రెకు సంబంధించి బాధితులకు 15 రోజుల్లో నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకొని, ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకే కాకుండా, ఇతర గొర్రెలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
పశు వైద్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలన్నారు. 50 ఏండ్లు దాటిన గొర్రెల కాపరులకు పెన్షన్ ఇవ్వాలని, ఉచితంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని కోరారు. చేతివృత్తుల దారుల అభివృద్ధికి చేయూతనివ్వాలని కోరారు.
జీఎంపీఎస్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా కాసాని ఐలయ్య, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర మహాసభ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గార్డెన్లో ముగిసింది. నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా కాసాని అయిలయ్య, రాష్ట్ర అధ్యక్షునిగా కిల్లే గోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉడుత రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాడబోయిన లింగయ్య (హనుమకొండ), అవిశెట్టి శంకరయ్య(నల్లగొండ జిల్లా), సాదం రమేష్(జనగాం జిల్లా), రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా బొల్లం అశోక్(మహబూబాబాద్), మద్దేపురం రాజు (భువనగిరి), అమీర్‌పేట మల్లేష్ (రంగారెడ్డి), పరికి మధుకర్(వరంగల్), కాల్వ సురేష్ (కరీంనగర్), ఆలేటి యాదగిరి యాదగిరి(సిద్దిపేట), మరో 25 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.