Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వజన సంక్షేమమే దాని లక్ష్యం
- పరిధి దాటి మాట్లాడితే చర్యలు తప్పవు : జిల్లా కోర్టుల ప్రారంభ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు
- పని భారం ఎక్కువగా ఉన్న కోర్టులను విభజించాలి : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
న్యాయ వ్యవస్థ అనేది ఏ ఒక్కరి ప్రయోజనాల కోసమో పని చేయబోదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సర్వజన సంక్షేమమే దాని లక్ష్యమని ఆయన తెలిపారు. న్యాయవ్యవస్థపై అవగాహన లేని కొందరు కోర్టు తీర్పులకు వక్రభాష్యాలు చెబుతూ ఉన్నత స్థానంలో ఉన్నవారిపై అభాండాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థను చక్కబెట్టుకోలేని వారే కోర్టులను తప్పుబడుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. పరిధులు దాటి మాట్లాడే వారిపై రాజ్యాంగపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. అవి దాటనంత వరకు న్యాయవ్యవస్థకు అందరూ మిత్రులే.. వాటిని దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే నిష్పక్షపాత, బలమైన, స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ అవసరమని ఆయన నొక్కిచెప్పారు.
గురువారం హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన 32 జిల్లా కోర్టులను జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషను గౌరవించి, తెలుగు సంస్కృతికి పట్టం కట్టిన ఈ నేలపై తెలుగులో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలని భావించిన తాను... భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అందుకోసం కృషి చేస్తున్నానని చెప్పారు. న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసం, అవగాహనను పెంచాలని సూచించారు. ఈ అంశంపై సమాజంలో ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని ఆకాంక్షించారు. వివిధ రాష్ట్రాల పర్యటనల సందర్భంగా న్యాయ వ్యవస్థ, న్యాయ విధానాల గురించి ప్రజలకు వివరించడంలో తాను ఎంతో కొంత విజయం సాధించానంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. అవసరం ఉన్న వారికి న్యాయం అందించాలనేది న్యాయ వ్యవస్థలోని ప్రధాన విధానమని ఈ సందర్భంగా రమణ నొక్కి చెప్పారు. విస్తృత సంక్షేమమే పాలనగా, దేశ న్యాయ వ్యవస్థలో తెలంగాణ నేడు ఒక కొత్త అధ్యయనానికి తెర తీసిందన్నారు. సాధారణ పరిపాలన వికేంద్రీకరణతో పాటు న్యాయ సేవల వికేంద్రీకరణకు తొలి అడుగు వేసిందని చెప్పారు. తెలంగాణలో 13 జ్యుడిషియల్ యూనిట్లు ఏకంగా 35 జ్యుడిషియల్ యూనిట్లుగా మారనున్నాయని, దేశంలో ఇంత భారీ స్థాయిలో న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ జరగడం ఇదే తొలిసారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎన్టీఆర్ పరిపాలనలో సంస్కరణల ద్వారా మండల వ్యవస్థను తీసుకొచ్చారు.. అదే తరహాలో అతిపెద్ద సంస్కరణ నేడు న్యాయ వ్యవస్థలో జరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రజలు, కక్షిదారులు, న్యాయవాదులపై ఉందని గుర్తు చేశారు. అప్పుడే ఈ వికేంద్రీకరణ ఫలితాలు అందరికీ అందుతాయని రమణ వివరించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో కొత్తగా 32 జిల్లా కోర్టుల్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. చాలా అంశాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందనీ, జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో నెంబర్ వన్‌గా ఉన్నామని వివరించారు. సీజేఐని కోరగానే హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచారని గుర్తు చేశారు. జిల్లా కొర్టుల విషయంలోనూ వెనువెంటనే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల్లో సెషన్స్ కోర్టులకు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండేదన్న సీఎం.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు. పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంటే న్యాయం వేగంగా చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. పని భారం ఎక్కువగా ఉన్న కోర్టులను విభజిస్తే ప్రజలకు సత్వర న్యాయం జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.