Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మెన్, ఎండీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ, వంద మిలియన్ టన్నుల బొగ్గు, మూడు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో ఐదేండ్లలో 50 వేల టర్నోవర్, ఇతర రాష్ట్రాల్లోకి గనుల విస్తరణ తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గతేడాది రికార్డు స్థాయిలో 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, రూ. 26 వేల కోట్ల టర్నోవర్ సాధించినట్టు చెప్పారు. బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నందున ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాక్‌లను చేపట్టాలని నిర్ణయించామన్నారు. రానున్న ఐదేండ్లలో 10 కొత్త గనులను ప్రారంభించుకోనున్నామనీ, తద్వారా 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్బంగా సంస్థలోని ఉత్తమ ఉద్యోగులను ఆయన సన్మానించారు. క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ (మార్కెటింగ్) జీఎం ఎం.సురేశ్ బహుమతులను అందజేశారు.
బీఆర్కె భవన్లో...
తాత్కాలిక సచివాలయమైన బీఆర్కె భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు.
హెచ్ఎండీఏలో...
హెచ్ఎండీఏలో జరిగిన వేడుకల్లో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్ జిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్‌బీపాస్ ద్వారా సత్వర అనుమతులు మంజూరవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.