Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు ప్రయత్నాలు
- నెలరోజుల్లో వచ్చే అవకాశం ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పథకానికి ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు త్వరలో పరిష్కారం కానున్నాయి. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను పూర్తిచేసేందుకు రూ. 2000 కోట్ల రుణం ఇవ్వాలని హౌసింగ్ అండ్ అర్భన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో)కు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చేసిన విజ్ఞప్తికి త్వరలో స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు హడ్కో అధికారులు భరోసాను ఇచ్చినట్టు సమాచారం. ఇదే విషయమై హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి రెండోసారి హడ్కో దగ్గర రుణం తీసుకుంటున్నది. ఈ పథకానికి ఇంతకుమందే హడ్కో రూ.8000 కోట్ల రుణాన్ని హడ్కో దగ్గర తెచ్చింది. తాము హడ్కో దగ్గర ఇంతకుముందే తీసుకున్న రూ.8000 కోట్ల మొత్తానికి వడ్డీ, అసలు కలిపి ప్రతి మూడు నెలలకు ఒకసారి వాయిదా పద్దతిలో నిధులు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తున్నదని అధికారులు అంటున్నారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణానికి కౌంటర్ గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. ఈనేపథ్యంలో హడ్కో రుణం తప్పనిసరిగా వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. తమ అభ్యర్థన పట్ల హడ్కో ఉన్నతాధికారులు సైతం సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఇదిలావుండగా ప్రభుత్వ అవసరాల కోసం గులాబీ సర్కారు విపరీతంగా అప్పులు చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే.