Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేత మహేష్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ ఇచ్చిన కానుక అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఇందిరాగాంధీ కూడా చేయలేని సాహసం సోనియా గాంధీ చేశారని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన జాతీయ జెండా ఎగరవేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం వస్తే తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోతారని ఆశించామన్నారు.అందుకు భిన్నంగా కేసీఆర్ కుటుంబం, ఆయన తాబేదార్లు,ఎమ్మెల్యేలు, ఎంపీలకు రాష్ట్రం బంగారమైందన్నారు.
1200 మంది బలిదానాలు చేసుకున్నారనీ,అందులో 400 మందికి మాత్రమే సహాయం చేశారని తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో తెలంగాణ ద్రోహులకే పెద్ద పీట వేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం రూ 4 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్రలేదనీ, తెలంగాణపై కూడా దాని ప్రభావం అంతగా లేదన్నారు. ఈనేపథ్యంలో గడిలో బందీ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మనిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్వర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు తదితరులు ఉన్నారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ రాజకీయాల్లోకి మతాన్ని లాగి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ అధ్యక్షులు బండి సంజరు మెంటల్‌గా మాట్లాడుతున్నారని విమర్శించారు.
దేశానికి తెలంగాణ పోరాట స్ఫూర్తి :రాహుల్‌గాంధీ ట్వీట్
తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన తెలంగాణ సోదరసోదరీమణులందరీకి శుభాకాంక్షలు అని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. చారిత్రాత్మకమైన రాష్ట్ర ఆవిర్భావం రోజున అమరవీవరులు, వారికి కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరించుంటామని పేర్కొన్నారు.
సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలి : మాణిక్కం ఠాగూర్ ట్వీట్
కరోనా బారిన పడిన ఏఐసీసీ అధ్యక్షులు సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రార్థనలు చేయాలని కోరారు. తెలంగాణ డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలలో ప్రార్థనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణకు గులాబీ చీడ : రేవంత్ ట్వీట్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చొరవతో కోట్లాది మంది ప్రజల అరవై ఏండ్ల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎనిమిదేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.''వందల మంది త్యాగాల సాక్షిగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వపరిపాలన సుపరిపాలన అవుతుందని ఆశించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టుకుంది. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ప్రతి ఒక్కరికీ ఏడుపే మిగిలింది. అమరుల త్యాగాలకు విలువ లేకుండా విధ్వంస పాలన సాగిస్తున్న ఆ చీడను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి. రైతు ఆత్మహత్యలు లేని, యువతకు ఉపాధి కల్పించి సకల జనుల జీవితాల్లో వెలుగులు నింపే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీ స్వప్నం. ఇందు కోసం పార్టీ విశ్రమించకుండా పని చేస్తుంది'' అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.