Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్లు నాగమణి, ఆండాళ్లు, శ్రీలక్ష్మి ఎందుకు కాలేదు?
- డీఎంఈకి మెడికల్ జేఏసీ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఉద్యోగుల విభజనపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో డీఎంఈ, డీహెచ్ విభాగాల నుంచి రిలీవ్ అయిన వారు.... వారి వారి స్వస్థలాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసినట్టు మెడికల్ జేఏసీ చైర్మెన్ డాక్టర్ బొంగు రమేశ్ తెలిపారు. గురువారం కోఠిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అందర్నీ రిలీవ్ చేసి పెట్లబురుజు సూపరింటెండెంట్ డాక్టర్ నాగమణి, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండాళ్లు. గాంధీ ఆస్పత్రి పెథాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీలక్ష్మిని ఎందుకు మినహాయించారని ఆయన ప్రశ్నించారు వీరి రిలీవ్‌పై కోర్టు స్టే ఏమైనా ఉన్నదా? లేదా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా? అని సందేహం వెలిబుచ్చారు. ఈ విషయాన్ని డీఎంఈ డాక్టర్ కె. రమేశ్ రెడ్డి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీకి చెందిన వారిని తెలంగాణకు కేటాయించగా వారిలో 140 మంది కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారనీ, ఇటీవల హైకోర్టు తీర్పునివ్వడంతో డీఎంఈ, డీహెచ్ ఆదేశాలు ఇవ్వగలిగారని నేపథ్యాన్ని వివరించారు. స్వయంప్రతిపత్తి కలిగిన సిద్ధిపేట, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల్లో పదవీ విరమణ చేసిన డాక్టర్లను డైరెక్టర్లుగా తీసుకోవాలనీ, లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు జోక్యం చేసుకుని ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.