Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విభజన హామీల అమలుకు ఉద్యమం
- ఆవిర్భావ దినోత్సవంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విభజన హామీలు అమలు చేయని బీజేపీకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. విభజన హామీలను అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అంతకు ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ వద్ద గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి ఇప్పుడు బుద్ధి వచ్చిందన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన ఎనిమిదేండ్ల తర్వాత ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో జరిపారని విమర్శించారు. రాజకీయంగా లబ్ధిపొందేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్ల కాలంలో విభజన హామీలు ఎక్కడ అమలు చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు గడుస్తున్నా, ఉద్యమ ఆకాంక్షలు అమలు కాలేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియమాకాలు, ఆత్మగౌరవ పరిపాలన ఇవ్వన్నీ అమలు అయ్యాయా?అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టులు బాగా కట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నదని అన్నారు. బంగారు తెలంగాణ పోయి అప్పుల తెలంగాణగా మారిపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.