Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మతోన్మద భావాలకు విరుగుడు మఖ్దూం మొహియుద్దీన్ రాసిన కవితలని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. కుల, మతోన్మాద కారుమేఘాలు కమ్ముకొస్తున్న నేటి తరుణంలో ప్రజలలో శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించడానికి చైతన్యవంతమైన సృజనశీలురంతా ఐక్యంగా ముందుకు సాగాల్సిన తరుణం అసన్నమైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ రూపొందించిన ''షాయరె తెలంగాణ మఖ్దూం మొహియుద్దీన్'' గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ మాట్లాడుతూ సెక్యులర్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసే మత మౌఢ్య శక్తులపట్ల అప్రమత్తంగా లేకపోతే సమాజానికి ప్రమాదమన్నారు. తెలంగాణ సమాజమంతా ఆవరించి ఉన్న గంగా జమునా తెహజీబ్ సంస్కృతిని కాపాడి సంరక్షించాల్సిన భాద్యత పౌరసమాజంపై ఉందన్నారు. సామాజిక విశ్లేషకులు డాక్టర్ అందె సత్యం మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో శాస్త్రీయ దృక్పధం అన్ని రంగాల్లో మరింతగా అభివద్ధి చెందాలని ఆకాంక్షించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో సమతుల్యత సాధించడానికి సెక్యులర్ భావనలను మరింతగా ముందుకు తీసుకుపోవాలని అన్నారు.
సీనియర్ జర్నలిస్ పాశం యాదగిరి మాట్లాడుతూ నాడు మతోన్మాద, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా, హిందూ-ముస్లిం ఐక్యత కోసం అసమానమైన పోరాటం చేసిన సాహితీ - రాజకీయ యోధుడు మఖ్దూం అని ఆయన చెప్పారు. గాంధీ విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు గున్నా రాజేందర్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎంవి గోనా రెడ్డి, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ కె రామదాసు, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు పద్మాచారి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ బిఎన్ రెడ్డి, వరప్రసాద్, రాజా, సురేశ్, భీమేశ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.