Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న గొడవతో... 12 మందిపై కుల బహిష్కరణ వేటు
- మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో...
నవతెలంగాణ-నిజాంపేట
మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన 12 మంది కుర్మ కులస్తులను కుల బహిష్కరణ చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... కుర్మ సంఘంలో 74 మంది సభ్యులున్నారు. వీరంతా 35 ఏండ్ల నుంచి కలిసి సొంతంగా చిట్టి నడుపుకుంటున్నారు. ఆ విషయంలో వచ్చిన చిన్నపాటి గొడవ కారణంగా చిట్టి డబ్బులు పంచుకున్నారు. తిరిగి కొత్త చిట్టి ప్రారంభించినా 12 మందిని మాత్రం అందులోకి అనుమతించలేదు. అంతేకాదు, వీరిని ఏ కార్యానికి పిలవొద్దని తీర్మానించారు. ఫిబ్రవరి నెలలో కుర్మకుల సభ్యులు మల్లయ్య మరణించడంతో అతని అంత్యక్రియలు, దశదినకర్మలకు ఈ 12 మంది సభ్యులు హాజరవడంతో పెద్ద గొడవే జరిగింది. అంతేకాదు, పెండ్లిండ్లు, కార్యాలు, నిశ్చితార్థాలు ఉన్నా వీరిని పిలవం లేదు. వారితో ఎవరూ మాట్లాడటమూ లేదు. తీవ్ర మనస్థాపానికి గురైన బాధితులు 12 మంది గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎర్ర మల్లయ్య, లక్ష్మి, బెల్లం కొమురయ్య, పరశురాములు, పర్ష చిన్న మల్లయ్య, మధుర బీరయ్య, మధుర ఎల్లం, బొమ్మల సింగం, బీరయ్య, పరశురాములు, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.