Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లాలో గుడిసెలు వేసుకున్నందుకు ..
వరంగల్ : వరంగల్ నగరంలో బెస్తంచెరువు, జక్కలొద్ది, ఉర్సుగుట్ట, ఖిలా వరంగల్లో గుడిసె వాసులపై దౌర్జన్యకాండ జరిగింది. భూ పోరాటానికి మద్దతు తెలపడానికి వెళ్లిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను అరెస్టు చేసిన మరుసటి రోజైన గురువారం ప్రభుత్వ అనుకూలశక్తులు బరితెగించాయి. గుడిసెవాసులపై దౌర్జన్యకాండకు దిగాయి. మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. దీంతో గుడిసెలు వేసుకున్న పేదల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రభుత్వం, పోలీసులు, భూ కబ్జాదారులు బృందంగా ఏర్పడి గంజాయి సేవించిన కొద్ది మంది రౌడీమూకలను, మఫ్టీలో పోలీసులను రంగంలో దించాయి. రాళ్లు రాడ్లు కత్తులతో జనంలోకి పరిగెత్తి వారిపై దాడులు చేశాయి. పిల్ల జెల్ల చూడకుండా దాడి చేశాయి. అక్కడ ఆటోలను, అమరవీరుల స్థూపాన్ని, భూ పోరాట సెంటర్ షెడ్డును ధ్వంసం చేశాయి. దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన సీపీఐ(ఎం) రంగసాయి పేట ఏరియా కమిటీ సభ్యుడు రమేష్ పై విచక్షణారహితంగా దాడి చేసి తల పగలగొట్టాయి. ఈ దాడికి ముందస్తుగా భూ పోరాట కేంద్రానికి వెళ్లే మూడు దారుల్లో... పోలీసులు జీపులు అడ్డంగా పెట్టి ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు. మొత్తం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులు జరిగాయి. భూ పోరాట కేంద్రాన్ని, ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం, పోలీసులు విరమించుకోవాలని సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. దాడులతో పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేసింది. వాస్తవానికి అనేకమార్లు మొరపెట్టుకున్నప్పుడే ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించి ఉండాల్సిందని సీపీఐ(ఎం) గుర్తు చేసింది. ప్రజలకు కలిగే నష్టానికీ, ఇబ్బందులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పిందని తెలిపింది.