Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఔనన్నా.. కాదన్నా.. ప్రజల్ని కలుస్తూనే ఉంటా... :
- రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ డాక్టర్ తమిళి సై
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'రాజ్యాంగ ప్రతినిధినైన నేను ప్రస్తుతం ఎన్నో సవాళ్ల మధ్య పని చేస్తున్నా...' అని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ వ్యాఖ్యానించారు. అయినా వాటన్నింటినీ అవలీలగా అధిగమిస్తున్నానని ఆమె తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరేసి... పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ...'నేను కేవలం మీ గవర్నర్‌ను మాత్రమే కాదు, మీ సోదరిని కూడా...' తఅన్నారు. రాజ్యాంగ ప్రతినిధినైనప్పటికీ తాను... ప్రజల సమస్యలను తెలుసుకోవటంలో భాగంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ మహిళల జీవితాలను పరిశీలించానని గుర్తు చేశారు. వారిలో ఉన్న రక్తహీనత లోపాన్ని గుర్తించి, పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఇదే మాదిరిగా ఎవరు ఔనన్నా.. కాదన్నా... ప్రజల్ని కలుస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీయే తన పుట్టిన రోజు కూడా కావటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్‌తోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, రాజ్‌భవన్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, పాత్రికేయులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పదకొండు మందిని గవర్నర్ ఈ సందర్భంగా సత్కరించారు. గవర్నర్ తన ప్రసంగం మొత్తాన్ని తెలుగులోనే కొనసాగించటం గమనార్హం. కాగా మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు, ఇప్పుడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం.. గవర్నర్‌ను ఆహ్వానించకపోవటం చర్చనీయాంశమవుతున్నది.