Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41.33 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
- మరో 11.43 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చని అంచనా
- శ్వేతపత్రం విడుదల చేసిన మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవుతాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకు 2,257 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయినట్టు చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటి వరకు 7.7 లక్షల మంది రైతుల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన 41.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామనీ, మరో 11.43 లక్షల మెట్రిక్ టన్నులు రావచ్చని అంచనా ఉందని చెప్పారు. రాష్ట్రంలో చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. గన్నీ బ్యాగులు, గోడౌన్లు, ట్రాన్స్ పోర్టు ఇబ్బందులు లేవన్నారు.
కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సమస్యలను వెంటనే పరిష్కరించేలా టోల్ ఫ్రీ నెంబర్లు, కమిషనర్ కార్యాలయంలో వార్‌రూం పని చేస్తున్నాయని తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన 15 వేల మెట్రిక్ టన్నులను సైతం సేకరించామన్నారు. ఎక్కడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించామని వెల్లడించారు. స్టోరేజీ సమస్య లేదని స్పష్టం చేశారు. జిల్లాల అంచనాల ప్రకారం పీపీసీల్లో 7.11 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయనీ, కోతలు పూర్తి కావలసిన 4.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా వస్తుందని పేర్కొన్నారు.