Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధనిక కుటుంబంలో పుట్టినా పేదలకే జీవితం అంకితం
- కమ్యూనిస్టులు లేకుండా సమస్యలకు పరిష్కారమే లేదు..
- డబుల్ బెడ్రూమ్ ఇవ్వరు.. గుడిసె వేసుకుంటే అరెస్టులా..?
- కొండపల్లి ఉత్తమ్, దుర్గాదేవిల సంస్మరణ సభలో : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఐద్వా జాతీయ నాయకులు పుణ్యవతి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
సమాజం కోసం.. సమాజ హితం కోసం.. ఓ శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన మార్క్సిజం - లెనినిజం కోసం కొండపల్లి దుర్గాదేవి, ఉత్తమ్‌కుమార్, కె.ఎల్. నర్సింహారావు తమ జీవితాలను త్యాగం చేసిన ధన్యజీవులని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఐద్వా జాతీయ నాయకులు పుణ్యవతి అన్నారు. తల్లీ కొడుకులకు ఒకే సందర్భంలో సంతాపం తెలపాల్సి రావడం బాధాకరమన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక హరిత గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన కొండపల్లి ఉత్తమ్‌కుమార్ ప్రథమ వర్ధంతి, ఆయన తల్లి దుర్గాదేవి సంస్మరణ సభలో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి మార్క్సిజం- లెనినిజమే మార్గమన్నారు. సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ సిద్ధాంతాలకు కాలం చెల్లిందన్నారు. కమ్యూనిస్టులు లేకుండా దేశానికి భవిష్యత్తు లేదని తెలిపారు. దేశ, రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, తెలంగాణలో ఒక్కో సంక్షేమ పథకానికి తిలోదకాలిస్తున్నారని తెలిపారు. కేంద్రంలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోగా గుడిసె వేసుకుంటే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ధనిక కుటుంబంలో పుట్టినా జీవితాలను పేదల కోసం త్యాగం చేసిన ధన్యజీవులు కేఎల్ కుటుంబం అని తెలిపారు. కుల వివక్షతో కూడిన సంస్కృతికి కేఎల్ కుటుంబం స్వస్తి పలికిందన్నారు. పేదలకు న్యాయ సహాయం చేయడంలో ఉత్తమ్‌కుమార్ ఎప్పుడూ ముందున్నార న్నారు. తెలంగాణ సాయుధ పోరాటం, మొదటి ఆంధ్రమహాసభ, మహిళా ఉద్యమాలకు కేఎల్, దుర్గాదేవిల కుటుంబం నేతృత్వం వహించిందన్నారు. బానిసత్వం, దొరతనానికి వ్యతిరేకంగా, బాంఛన్ కాల్మొక్త అనే ధోరణిని నిరసిస్తూ కేఎల్ కుటుంబం పోరు సల్పిందన్నారు. లౌకికతత్వం, ప్రజా ఆస్తుల పరిరక్షణ కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు. అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరు సూచించిన ఘనత కొండపల్లి లక్ష్మీనర్సింహారావుదని గుర్తుచేశారు. మహిళా సంఘం మొదటి మహాసభ నిర్వహించిన ఘనత దుర్గాదేవిదైతే.. పాండురంగారావు కమిషన్ ఎదుట భూ పోరాట మృతుల కుటుంబాల తరపున వాదనలు వినిపించిన ఖ్యాతి ఉత్తమ్కుమార్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ కొనియాడారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సంస్మరణ సభలో.. రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి, సోమయ్య, ఐలూ రాష్ట్ర కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు రఘు, ఉమ్మడి జిల్లా నాయకులు గొల్లపూడి రామారావు, పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తదితరులు ప్రసంగించారు. సభా ప్రారంభానికి ముందు దుర్గాదేవి, ఉత్తమ్‌కుమార్ చిత్రపటాలకు తమ్మినేని, పుణ్యవతి తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. సభలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్, భూక్యా వీరభద్రం, బంతు రాంబాబు, వై.విక్రమ్, ఐద్వా జిల్లా నాయకురాళ్లు బండి పద్మ, అఫ్రోజ్ సమీన, కమలాదేవి, కొండపల్లి దుర్గాదేవి, ఉత్తమ్కుమార్ల కుటుంబసభ్యులు పావన్, జైపాల్, రాహుల్, బార్ అసోసియేషన్, ఐలూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.