Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజ్ఞానానికి పదును పెట్టే సాధనం
- ఖమ్మం పుస్తక మహౌత్సవ ప్రారంభోత్సవంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్
- నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ స్టాల్నూ ప్రారంభించిన మంత్రి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈ ప్రపంచంలో పుస్తకానికి ఉన్న విలువ దేనికీ లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. విజ్ఞానానికి పదును పెట్టే సాధనం పుస్తకం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ బుక్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలోని రావెళ్ల వెంకటరామారావు (జాతశ్రీ వేదిక) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఖమ్మం పుస్తక మహౌత్సవాన్ని మంత్రి గురువారం సాయంత్రం ప్రారంభించారు. పఠన సంస్కృతిని పెంపొందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విజ్ఞానానికి పదును పెట్టే సాధనం పుస్తకమన్నారు. పుస్తక పఠనం ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సామాజిక విలువలు పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పుస్తక పఠనంతో విశిష్ట వ్యక్తులుగా రాణిస్తున్నారని తెలిపారు. ఆధునిక కాలంలో పుస్తకమే నిజమైన స్నేహితుడని ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్‌సురభి చెప్పారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు అలవర్చాలన్నారు. అంతకుముందు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ స్వాగతం పలుకగా అధ్యక్షులుగా ప్రసేన్ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్యం సందర్శకలను ఆకట్టుకుంది. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా, సుడా చైర్మన్ బచ్చు విజరుకుమార్, ఆర్జేసీ కృష్ణ, నిర్వాహకులు అట్లూరి వెంకటరమణ, రవిమారుత్, ఐవీ రమణ పాల్గొన్నారు.
'నవతెలంగాణ' బుక్‌స్టాల్‌ను ప్రారంభించిన మంత్రి
ఈ బుక్ఫెయిర్లో భాగంగా 'నవతెలంగాణ' పబ్లిషింగ్ హౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6, 7, 30 నంబర్ల స్టాల్స్‌ను మంత్రి పువ్వాడ అజరుకుమార్ ప్రారంభించారు. రాబోయే పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సంస్కృతి, చరిత్ర, భౌగోళిక స్వరూపం, తెలంగాణ ఉద్యమాలతో కూడిన పుస్తకాలు, ప్రముఖ రచయితల పుస్తకాలెన్నో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ స్టేట్ ఇన్చార్జి కృష్ణారెడ్డి, రీజినల్ మేనేజర్ జావీద్, బుకహేౌస్ మేనేజర్ కె.వెంకటేశ్వర్లు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.