Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిందే మోడీ సర్కార్
- క్షుద్ర రాజకీయాలకు బీజేపీ ప్రతిరూపం
- ఢిల్లీకి వస్తామన్నందుకే హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో నిర్వహించాలని బీజేపీి తీసుకున్న నిర్ణయంపై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణాపై విషం చిమ్మే ప్రధాని మోడీ, ఆయన ఆప్త మిత్రుడు మంత్రి అమిత్ షా ఆ ఉత్సవాల్లో పాల్గొనడం వెనుక కుట్ర ఉందని చెప్పారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను బీజేపీ నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని.. అయితే, ఎనిమిదేండ్లుగా ఆ పార్టీకి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణకు మొట్టమొదట ద్రోహం చేసిందే బీజేపీ అని విమర్శించారు. విభజన సమయంలో వచ్చిన ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన బీజేపీ.. నేడు సంబురాలు చేయడం అంటే మోడీ, అమిత్ షా కలిసి ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. ఇటువంటి కొంగ జపాలకు మోసపోయే అమాయకపు చేపలు కాదు తెలంగాణ ప్రజలు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోతామన్న తొలి ప్రకటనకే ఆ పార్టీ ఉలిక్కిపడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
క్షుద్ర రాజకీయాలకు బీజేపీ పెట్టింది పేరని విమర్శించారు. బీజేపీదంతా వాట్సాప్ యూనివర్సిటీ మాయాజాలమని ఎద్దేవా చేశారు. గుజరాత్లో జరుగుతుంది ఇదే తంతు అని తెలిపారు. దేశంలో మోడీ పాలనలో 80 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. అదంతా అదాని, అంబానీలకు దోచిపెట్టడం కోసమేనని విమర్శించారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేస్తే.. బీజేపీకి ఎనిమిదేండ్లే పట్టిందన్నారు. ప్రధాని మోడీ పర్యటనలో ఏనాడైనా నిధులు విదిలించిన దాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మెన్ గుజ్జ దీపికా యుగందర్‌రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మెన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ పాల్గొన్నారు.