Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పల్లె, పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు
- పలుచోట్ల నిధులపై నిలదీసిన సర్పంచ్‌లు ొ భద్రాద్రిలో నిరసన.. భిక్షాటన
నవతెలంగాణ- విలేకరులు
ప్రతి పల్లె, వార్డు, పట్టణంలో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు ప్రభుత్వం పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేస్తోందని మంత్రులు చెప్పారు. శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అయితే, గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రాలేదు.. మళ్లీ ఎలా పనులు చేయాలంటూ వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న సర్పంచ్‌లు.. శుక్రవారం కూడా నిరసన తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. భద్రాద్రి జిల్లాలో భిక్షాటన చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. క్రీడా ప్రాంగణంలో నూతనంగా వాలీబాల్ కోర్టును ప్రారంభించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మోతినగర్‌లో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. వంద కోట్లతో చేపట్టిన పెద్ద చెరువు, మినీ ట్యాంక్ బండ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అప్పన్న పల్లిలోని రెండో రైల్వే బ్రిడ్జి పనులు రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలియజేశారు. వనపర్తి జిల్లా రూరల్ పరిధిలోని అంకూర్ గ్రామంలో పల్లెప్రగతి పనులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి ప్రారంభించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. దళితబంధు లబ్దిదారులకు ట్రాక్టర్లు, వాహనాలను పంపిణీ చేశారు.
పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ శుక్రవారం ఉదయం రెండు గంటల పాటు సైకిల్‌పై ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తిరిగారు. ప్రజలు వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. నగర వీధుల్లో తిరుగుతూ పారిశుధ్యం, విద్యుత్ స్తంభాలు, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్ బోర్లు, డివైడర్లు, సెంట్రల్ డివైడర్లలో ఉన్న మొక్కలు, మురుగు కాల్వలు పరిశీలించారు. డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టి, చెత్తను స్వయంగా తొలగించారు. రోడ్ల వెంట పిచ్చి మొక్కలు తొలగించారు. రఘునాధపాలెం మండలం జీకే బంజర పంచాయతీలో పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా రూ.2. 25 కోట్లతో పలు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ అజరు కుమార్ ప్రారంభించారు.
పల్లెప్రగతిని బహిష్కరించిన సర్పంచ్‌లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామసభ ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ కొమరం సీతారాములు, వార్డు సభ్యులు గ్రామ సభకు హాజరు కాకుండా గ్రామంలో జోలె కట్టుకొని బిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాల డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి పంచాయతీ అభివృద్ధికి ఖర్చు పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ ఆ బిల్లులు రాలేదని, మళ్లీ కొత్త అభివృద్ధి పనులు ఎలా చేయాలని ప్రశ్నించారు.
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలోని దావాజీపల్లి, అన్నారం తండా, గోప్లాపురం, మల్లాయిపల్లి, చింతకుంట గ్రామాల్లో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాలేదని నిరసన తెలిపారు. తెల్లరాళ్లపల్లి తండాలో బిల్లుల జాప్యం, అభివృద్ధి పనుల గురించి తెలపాలని కోరగా అందుకు అధికారులు స్పందించకపోవడంతో వినతిపత్రం అందజేసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరు తండా వాసులు తప్ప అందరూ అధికారులే పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేసి కార్యక్రమాన్ని బహిష్కరించారు.
నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, బీజేపీ ఫ్లోర్‌లీడర్ పోలోజు శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కొయ్యడ సైదులుగౌడ్, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, సందగల్ల విజయసతీశ్గౌడ్ ధర్నా చేశారు.