Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జక్కలొద్ది నిరుపేదలపై రౌడీలతో దాడులు దారుణం ..
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మీరు చేస్తున్న పోరాటం వృథా కాదని, మీకు ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం జక్కలొద్దిలో గుడిసెవాసుల పోరాటానికి మద్దతు తెలిపి ప్రసంగించారు. గురువారం రాత్రి పోలీసులు రౌడీలతో గుడిసెవాసులపై దాడి చేయించడాన్ని ఖండించారు. జక్కలొద్దిలో 296 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆక్రమించుకున్నట్టు తెలుస్తోందన్నారు. పక్క ఊరు వాళ్లను రెచ్చగొట్టి ప్రజలు తన్నుకునేలా చేయడం దుర్మార్గమన్నారు. ఈ పోరాటం జయప్రదం కావాలని, అరెస్టు అయిన నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మీ పోరాటానికి సంఘీభావం తెలపడానికి వస్తుండగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. తాను సమ్మక్క, సారలమ్మ జాతర చూడలేదని, ఇక్కడ మాత్రం సమ్మక్క, సారలమ్మ జాతరలా ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు నగరంలో ఇండ్లు కిరాయి ఇవ్వడం లేదని పలువురు మహిళలు చెప్పారని, ఇది బాధాకరమని తెలిపారు. బీజేపీ వాళ్లు మత విద్వేశాలు రెచ్చకొడుతున్నారన్నారు. పేదలకు భూములు లేకుండా చేశారన్నారు. పేదలపై దాడులు చేసిన రౌడీల వెనుక పెద్ద పెద్దోళ్లుంటారన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని ఎనిమిదేండ్లైనా నేటికీ ఇవ్వలేదన్నారు. వరంగల్ నగరంలో 2005లో రాజీవ్ గృహ కల్పలో 632 ఇండ్లను నిర్మించి నేటికీ 17 ఏండ్లైనా పేదలకు ఇవ్వలేదన్నారు. మనకు దక్కాల్సిన వాటా దక్కించుకునేలా పోరాటం చేయాలన్నారు. మీరెంత గట్టిగా పోరాడితే, మేం మీకు అంతా గట్టిగా మద్దతు ఇస్తామన్నారు.
కుల, మతాలు లేవు.. మనమంతా పేదలం : ఎస్. వీరయ్య
కుల, మతాలు లేవని, మనమంతా పేదలమని, మీరంతా ఐక్యంగా పోరాటం చేస్తేనే ఇండ్ల స్థలాలు దక్కుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్న తరుణంలో ఇండ్ల స్థలాలు కావాలని పోరాటం చేస్తున్న నిరుపేదలపై రౌడీలను ఉసిగొల్పి పోలీసులు దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. మామునూరు సీఐ కరెంటు కట్ చేయించి మరీ దాడులు చేయించడం విచారకరమన్నారు. దారులన్నీ బంద్ చేసి పేదలను కొట్టిస్తారా అని ప్రశ్నించారు. తాము ఇక్కడకు వస్తుంటే జక్కలొద్ది దారిలో ఎవరూ రాకుండా చెత్తను డంప్ చేయడం దేనికి సంకేతమన్నారు. గర్భిణీ స్త్రీలను సైతం కొట్టించడం దారుణమన్నారు. ఇంత భయానక పరిస్థితిని కల్పించినా 'మేం కదిలే ప్రసక్తే లేదని' మహిళలు మూకుమ్మడిగా చెప్పడాన్ని అభినందించారు. ఎర్రజెండా నీడలో మీ పోరాటం కొనసాగించాలన్నారు. జక్కలొద్దిలో 296 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 250 ఎకరాలను ఇప్పటికే కోటీశ్వరులు కబ్జా చేశారన్నారు. మీకు చేతనైతే 250 ఎకరాలు కబ్జా చేసిన వారిని ఖాళీ చేయించాలని సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని చెప్పి పేదలకు ఇవ్వలేదన్నారు. నిర్మించిన ఇండ్లను సైతం లబ్దిదారులకు పంపిణీ చేయకపోవడం దుర్మారగమన్నారు.
వరంగల్ పేదల పోరాటానికి 1100 కేంద్రాల్లో ప్రజల మద్దతు : పోతినేని
మీరు చేస్తున్న పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా 1,100 కేంద్రాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహించి మీకు మద్దతు తెలిపారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తెలిపారు. అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతున్నారని, రెండ్రోజులు మీరు మాతో ఉండండి.. పేదరికం, పేదలంటే ఏంటో తెలుస్తుందన్నారు. మన మీదకు వస్తే మీరు ఆత్మరక్షణకు ముందుకు కదలాలన్నారు. మీ పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని, మనం విజయం సాధిస్తామని భరోసానిచ్చారు.
గర్భిణీ స్త్రీని ముండ్ల కంచెలో నెట్టేశారు :రైనా సుల్తానా
మా చెల్లె గర్భిణీ, షర్ట్ లేకుండా వచ్చిన ఒకతను కర్ర తీసుకొని కొట్టాడు. అడ్డుకుంటే బెదిరించడమే కాకుండా మా చెల్లెను ముండ్ల కంచెలో నెట్టేయడంతో కాళ్లకు ముండ్లు గీరుకుపోయి గాయపడింది. కొందరు కత్తులతో బెదిరించారు. మాకు తల్లిదండ్రులు లేరు.. అత్తమామలు లేరు.. సిటీలో ఇండ్ల కిరాయిలు కట్టలేక ఇండ్ల స్థలం కోసం ఇక్కడికి వచ్చాం.
ఎదురు తిరిగితే నా కడుపులో తన్నిండ్రు : మాధవి
రాత్రి 20 మంది దాకా తాగి వచ్చిండ్రు. చేతల్లో సీసాలు, కర్రలున్నారు.. రమేశన్నను కొడుతుంటే అడ్డుకున్నందుకు నా కడుపులో తన్నిండు.. ఈలోపు సీసాతో రమేశన్న తల పగులకొట్టిండు.
ఎంజీఎంలో రమేశ్‌కు సీపీఐ(ఎం) నేతల పరామర్శ
జక్కలొద్దిలో నిరుపేదలపై రౌడీలు చేసిన దాడిలో గాయపడ్డ రమేశ్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. రాములు, జగదీశ్, వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్. రంగయ్య తదితరులు పరామర్శించారు. దాడి జరిగిన విధానంపై రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు.
పోలిస్ కమిషనర్‌కు వినతి
జక్కలొద్ది నిరుపేదలపై రౌడీలతో దాడి చేయించిన సంఘటనపై సీపీఐ(ఎం) నేతలు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషిని శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. మామునూరు సీిఐ రౌడీలను రెచ్చగొట్టి నిరుపేదలపై దాడులు చేయించాడని తెలిపారు.