Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షులు పి మధుసూదన్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇంటర్ విద్య కమిషనర్ కార్యాలయంలో అసిస్టెట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రసన్నలతను బెదిరించిన కేసులో ఆయనకు కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. అక్రమ ఆస్తుల సంపాదన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఏసీబీ రైడ్ జరిగి రెండు నెలల జైలు జీవితం గడిపిన ఆయన మూడేండ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ప్రసన్నలతను బెదిరించిన కేసులో అన్ని ఆధారాలతో తోటి సిబ్బంది సంతకాలతో హైదరాబాద్‌లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ చేపట్టిన విచారణ అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేసి కోర్టులో సమర్పించారు. గత నెల 30న ఆ కేసు విచారణకు వచ్చింది. దానికి సంబంధించి కోర్టుకు హాజరు కాకపోవడం, ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం పట్ల మధుసూదన్ రెడ్డిపై 17వ మెట్రో పాలిటన్ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసి నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 26వ తేదీకి వాయిదా వేశారు.