Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నో పార్టీలను ఒప్పించి ఇచ్చారు
- తెలంగాణలో అధికారంలోకి వచ్చి బహుమతి ఇద్దాం
- డల్లాస్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో రేవంత్రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ చొరవతోనే ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి గుర్తు చేశారు. ఎన్నో పార్టీలను ఒప్పించడం ద్వారా ఆమె రాష్ట్ర ఏర్పాటుకు చొరవ తీసుకున్నారని తెలిపారు. శుక్రవారం తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయులు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని డల్లాస్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ 'తల తెగి పడ్డా వెనకడుగు వెయ్యను మాతో కలిసి రండి. అవినీతి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేద్దాం' అని పిలుపునిచ్చారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో పుట్టి అమెరికాలో ఎంతగానో ఎదిగిన మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. అమెరికా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉండటం మాకందరికీ గర్వకారణమని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం టీడీఎఫ్ ఏర్పాటు చేసి మీరు అందు కోసం ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. ఇక్కడ ఎంతో శ్రమిస్తూ... దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని చెప్పారు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారనీ, ఏ లక్ష్యం కోసమైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. చందాలు అడగడానికో, ఓట్ల అడగడానికో రాలేదని స్పష్టం చేశారు. తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలను కలిసి సాధించుకుందామని చెప్పడానికే వచ్చానన్నారు. తెలంగాణలో పరిస్థితులు బాగా లేవనీ, కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్, కొడుకు, అల్లుడు, బిడ్డ, సడ్డకుడి కొడుకు, బంధువులు, చుట్టాలు వేల కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణను బందీ చేశారని విమర్శించారు. 'తెలంగాణ ప్రజలకు అప్పులు, ఆత్మహత్యలు మిగిలాయి.
ఉద్యోగాలు లేవు. సకాలంలో జీతాలు లేవు.ముసలోళ్ళకు పెన్షన్లు లేవు. 60 ఏండ్ల తెలంగాణలో అన్ని వనరులు అభివృద్ధి చేస్తే కేసీఆర్ కుటుంబం అన్నింటినీ దోచుకున్నది' అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం బందీఖానా నుంచి రాష్ట్రాన్ని విడిపించాలని కోరారు. తనను చర్లపల్లి జైలులో వేశామని అంటున్నారనీ, కేసీఆర్ అవినీతిని నిరూపించి శాశ్వతంగా ఆయన కుటుంబాన్ని జైల్లో వేద్దామని చెప్పారు.
ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువకుడు ఉద్యోగం లేదని రైల్కు అడ్డంపోయి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఆత్మ గౌరవం, స్వయం పాలన సామాజిక న్యాయం కోసం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామనీ, ఈ బానిస బతుకు నుంచి విముక్తి కోసం కొట్లాడుదామని కోరారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.