Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
- పంట ఆన్లైన్ నమోదుకు లంచం తీసుకున్న అధికారి
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
రైతు పండించిన పంటను ఆన్లైన్లో నమోదు చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారి రైతు వద్ద రూ.500 లంచం తీసుకున్నందుకు అధికారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు శుక్రవారం జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూర్ క్లస్టర్ పరిధిలో ఓ రైతు తాను పండించిన పంట వివరాలతో వ్యవసాయ విస్తరణ అధికారి అయిన అజీజ్ ఖాన్ వద్దకు శుక్రవారం వెళ్లాడు. ఆన్లైన్లో నమోదు చేయాలని కోరాడు. అందుకు తప్పనిసరిగా రూ.500 ఇవ్వాల్సిందేనని అధికారి రైతుతో చెప్పాడు. డబ్బులు లేవని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నగదు లేకుంటే గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా పంపాలన్నాడు. చేసేదేమీ లేక ఆ రైతు విస్తరణ అధికారికి 'ఫోన్ పే' ద్వారా రూ.500 పంపించాడు. ఈ తతంగాన్ని మొత్తం ఆ రైతు తన ఫోన్లో వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో స్థానికంగా వైరల్ అవడం.. జిల్లా అధికారులు దృష్టికి చేరడం జరిగిపోయాయి. విషయం కలెక్టర్ అనురాగ్ జయంతి దృష్టికి వెళ్లడంతో సదరు అధికారి అజీజ్ఖాన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.