Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాన్నే అభివృద్ధి సూచిగా చూపుతున్న ప్రభుత్వం
- ప్రజలపై పెరుగుతున్న ఆర్థికభారాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అప్పు... అభివృద్ధికి సూచిక అనే ప్రభుత్వం భావిస్తున్నది. పట్టణీకరణ పేరుతో రాష్ట్రంలో మున్సిపాల్టీల సంఖ్యను పెంచి, దాన్నే అభివృద్ధి నమూనాగా చూపుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 69 మున్సిపాల్టీలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 142కు పెరిగింది. ఇది రాష్ట్ర భూభాగంలో మూడు శాతంగా ఉన్నట్టు పురపాలకశాఖ ప్రకటించింది. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఇక్కడి నుంచే వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మున్సిపాల్టీలుగా మారగానే క్రమేణా ఆస్తిపన్ను, నీటిపన్ను సహా అనేక పన్నుల్ని పెంచేస్తున్నారు. ఇవి ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే ఆయా మున్సిపాల్టీల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం భారీగానే అప్పులు చేస్తున్నది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోనే పెట్టుబడి ప్రధానమైన పనులు చేపట్టడానికి రూ.5,983 కోట్ల అప్పు చేసినట్టు 2021-22 పురపాలకశాఖ వార్షిక నివేదిక పేర్కొన్నది. దీనిలో దాదాపు రూ.2వేల కోట్లను ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా స్వయంగా జీహెచ్ఎంసీనే పొందినట్టు ఆ నివేదికలో గొప్పగా పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ గ్యారెంటీ అప్పు అప్పటికే రూ.3,983 కోట్లు ఉన్నట్టు స్పష్టమవుతున్నది. జీహెచ్ఎంసీ పనితీరును నిశితంగా పరిశీలించిన రుణ సంస్థలు ప్రభుత్వ హామీ లేకుండానే రూ.2వేల కోట్లు రుణం ఇవ్వడం ఘనకార్యంగా పురపాలకశాఖ ప్రకటించుకున్నది. జీహెచ్ఎంసీ చేసిన రూ.5,983 వేల కోట్ల అప్పుతో రూ.8,965 కోట్ల విలువైన పనుల్ని చేపడుతున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని ఇతర మున్సిపాల్టీల్లో పౌర సౌకర్యాల కల్పన పేరుతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా రూ.4వేల కోట్లు అప్పు తీసుకొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో పనులు ప్రారంభిస్తామని నివేదికలో పేర్కొన్నారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.90 కోట్ల టెర్మ్ లోన్ తీసుకుంది. ఐదేండ్ల గడువుతో ఈ రుణాన్ని తీసుకున్నారు. ఈ నిధులతో రోడ్లు, కాలువలు, వైకుంఠధామాలు నిర్మిస్తామని బ్యాంకర్‌కు ప్రాజెక్ట్ రిపోర్టు ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన పది మున్సిపాల్టీల్లో 104 రోడ్ల నిర్మాణాన్ని రూ.2,410 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) ద్వారా పై మొత్తాన్ని అప్పుగా తేనున్నారు. దానికి సంబంధించిన ప్రణాళికల్ని ఆ సంస్థ ఇప్పటికే తయారు చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. స్వయం సమృద్ధితో జరగాల్సిన పురపాలన, పూర్తిగా అప్పులతో జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే. అయితే అప్పు తప్పు కాదనే ప్రభుత్వ విధానపరమైన వాదనను ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌లు పలుమార్లు ప్రకటించారు.