Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6న ఇందిరాపార్క్ వద్ద ఆత్మగౌరవ దీక్ష
- పోస్టర్ ఆవిష్కరించిన కోదండరాం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులను తీసుకొచ్చారని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఎనిమిదేండ్లయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఈనేపథ్యంలో ఈ నెల 6న ఇందిరాపార్కు వద్ద ఆత్మగౌరవ దీక్ష చేపట్టనున్నట్టుతెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో అందుకు సంబంధించిన పోస్టర్ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షలు, ఉపాధి అవకాశాలు, ఉచిత విద్య, వైద్యం తదితర అంశాల్లో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్ప ప్రభుత్వానికి ఆదాయం రాని దుస్థితి వచ్చిందన్నారు. జర్నలిస్టులకు కనీసం అక్రిడిటేషన్లుగానీ, వారికి ఇంటిస్థలాలు కూడా ఇవ్వలేని పరిస్థతులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సరైన సమమయంలో జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేపట్టబోయే దీక్షకు గద్దర్, మందకృష్ణమాదిగ, ప్రొఫెసర్ హరగోపాల్, విమలక్క, పాశంయాదగిరితోపాటు పలువురు ప్రొఫెసర్లను, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.