Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోం మంత్రి మహమూద్ అలీ
- 669 మంది పోలీసులకు పతకాలు బహూకరించిన మంత్రి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర అభివృద్ధికి శాంతి భద్రతలు సవ్యంగా ఉండటమే ప్రధాన కారణమని రాష్ట్ర హౌమ్ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి పోలీసు అభినందనీయుడని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో ప్రతిభను చాటిన 669 మంది పోలీసులకు రవీంద్ర భారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హోం మంత్రి పతకాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు సవ్యంగా ఉంచటానికి ప్రభుత్వం అత్యుత్తమ ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే పోలీసు శాఖ ఆధునీకీకరణ, భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి తగినన్ని నిధులను కేటాయించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మాఫియాను అరికట్టడానికి, వీటి రవాణాను సమర్థవంతంగా నిరోధించటానికి పోలీసు శాఖ ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసిందని చెప్పారు. సైబర్‌క్రైమ్ మొదలుకొని వివిధ నేరాలను అరికట్టడానికి నిత్యం కృషి సాగుతున్నదని అన్నారు. ముఖ్యంగా, మట్కా, జూదం, పేకాట క్లబ్బులను కఠినంగా అణచివేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ అందిస్తున్న సేవల కారణంగా దేశవ్యాప్తంగా బెస్ట్ పోలీసింగ్ అనే పేరును గడించిందని ఆయన అన్నారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పతకాలను పొందటం పోలీసుల ప్రతిభకు గీటురాయిగా మారిందనీ, వీటి స్ఫూర్తితో పోలీసు అధికారులు మరింతగా తమ ప్రతిభను ఇనుమడింపజేయాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మహిళలకు తగిన రక్షణ కల్పించటం, ప్రజలకు మరింత సేవలనందించటంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధను వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమినర్లతో పాటు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఎస్పీ మొదలుకొని కానిస్టేబుల్ స్థాయి వరకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.