Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వంటగ్యాస్ సబ్సిడీని కొనసాగించాలనీ, లేదంటే ఉద్యమం తప్పదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య పార్కువద్ద ఐద్వా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా గ్యాస్, పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుతున్నదని పేర్కొన్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం పడుతున్నదని తెలిపారు.ఉజ్వల పథకం లబ్దిదారులకు మాత్రమే ఎల్పీజీ సీలిండర్పై రాయితీ ఇస్తామని చెప్పటమేంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానం మూలంగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రజలపై మోడీ సర్కార్ వరస భారాలను మోపుతున్నదని విమర్శించారు. ఉపాధి దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే..ప్రజలపై భారాలు మోపటమేంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు బి హైమావతి, ఆశాలత, గీత, వినోద, నాగలక్ష్మి, సహాయ కార్యదర్శి మాచర్ల భారతి, రాష్ట్ర నాయకులు స్వర్ణ, బండి పద్మ, సృజన, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.