Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది స్వీకరించిన పోడు దరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ హెచ్చ రించారు. పోడు సమస్యను ప్రభుత్వం పరిష్కరిం చేంత వరకు సాగుదారులపై అటవీ శాఖ దాడులు ఆపాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మంచికంటి భవన్లో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గూగులోత్ ధర్మ నాయక్ అధ్యక్షతన శుక్రవారం పోడు రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ్నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలవుతున్నా ఇంతవరకు పరిశీలన చేయలేద న్నారు. దీని వల్ల క్షేత్ర స్థాయిలో పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వీక రించిన దరఖాస్తులపై గ్రామ స్థాయిలో భూములను సర్వే చేయడం, సరిహద్దులు నిర్ణయించడం, మ్యాపులు సరిచూసుకోవడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత మంది పోడు సాగుదా రులు ఎన్నిలక్షల ఎకరాలపై దరఖాస్తులు చేసుకు న్నారో జిల్లాల వారీగా సంఖ్యలను బహిర్గతం చేయ కుండా రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయకుండా హక్కు పత్రాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లేక పోతే అన్ని గిరిజన, ప్రజా సంఘాలతో పాటు వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ గిరిజన సమాఖ్య అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి నాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ రాజేష్ నాయక్ , గిరిజన సంఘం ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కార్యదర్శులు భూక్యా వీరభద్రం, బానోత్ నాగేశ్వరరావు, గిరిజన సమాఖ్య కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భూక్యా శ్రీనివాస్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.