Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీ కార్యదర్శుల తరహాలో...
- అభివృద్ధి పథంలో పట్టణాలు : పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పంచాయతీ కార్యదర్శుల తరహాలో మున్సిపాల్టీల్లో వార్డు ఆఫీసర్లను నియమిస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే, ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు. 50 వేల జనాభా ఉన్న పట్టణాల్లో రెండు వార్డులకు కలిపి ఒక అధికారి, 50వేలకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో వార్డుకు ఒక అధికారిని నియమిస్తామని వివరించారు. పురపాలక శాఖలో ఈ ఏడాది ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా అన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నదనీ, దానితోపాటే అభివృద్ధి కూడా పోటీపడుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎక్కువ స్మార్ట్ సిటీలు మంజూరు చేయాలనీ, అందుకు అనుగుణంగా నిధులు కూడా ఇవ్వాలని కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సర పురపాలక శాఖ వార్షిక నివేదికను శుక్రవారంనాడిక్కడి నానక్‌రాంగూడ హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ శివార్లలో ముంపు సమస్యను అధిగమించేందుకు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ (ఎస్ఎన్డీపీ) కార్యాక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. పట్టణాల్లో ఎంత అభివృద్ధి జరిగినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుందనీ, మీడియా దాన్ని భూతద్దంలో చూపెట్టడం మానుకోవాలని చెప్పారు. 2050 నాటికి దేశంలోని 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసిందనీ, తెలంగాణలో మాత్రం 2025 నాటికే ఆ మార్పు వస్తుందని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని 30 ఉత్తమ నగరాల్లో ఒకటిగా ఉంచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. స్థిరాస్తి వ్యాపారం, ఇండ్ల నిర్మాణంలో వృద్ధి సాధిస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగ్‌రోడ్‌పై (ఓఆర్ఆర్) ౖ రూ.100 కోట్లతో ఎల్ఈడీ లైటింగ్, 27 కి.మీ., సైకిల్ ట్రాక్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. మూసీ నదిపై 14 వంతెనల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. పూర్తయిన, పనులు కొనసాగుతున్న ఇండ్లను ఈ ఏడాది లబ్ధిదారులకు కేటాయిస్తామనీ, మూసీ, నాలాలపై ఇండ్లు కట్టుకున్న వారిని అక్కడకు తరలిస్తామని చెప్పారు. దేశంలోని సర్వోన్నత ఏడు మెట్రో నగరాల్లో చదరపు అడుగుకు రూ.4,450 రేటుతో హైదరాబాద్ అత్యంత సరసమైన నివాస నగరంగా ఉందన్నారు. కమర్షియల్ స్పేస్‌లో గతేడాది హైదరాబాద్‌తో పోలిస్తే బెంగుళూరు రెండో స్థానానికి పరిమితమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే ఈ ఏడాది మరిన్ని అవార్డులు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మున్సిపల్, పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, సీడీఎమ్ఏ ఎన్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ డీ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.