Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం
- నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులున్నట్టు సమాచారం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్/సిటీ బ్యూరో
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ పబ్‌కు వచ్చిన బాలిక(17)ను కారులో బలవంతంగా తీసుకెళ్లిన కొందరు యువకులు సామూహిక లైంగికదాడి చేశారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం..
గతనెల 28న ఓ బాలిక(17) జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని (ఆమ్నేషియా) ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయంలో బాలిక బయటకు వచ్చింది. అక్కడే ఉన్న బెంజి, ఇన్నోవా రెండు కార్లలో ఉన్న 8 మంది యువకులు బాలికను బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. బెంజికారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు, మరో ప్రజాప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నట్టు సమాచారం. వీరంతా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం ఒక కారులో నిర్మానుష్య ప్రాంతానికెళ్లి ఆపి ఐదుగురు యువకులు బాలికపై సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం 7.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాలిక తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బాలిక మెడ చుట్టూ గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీశారు. కారులో తీసుకెళ్లి ఐదుగురు తనపై లైంగిక దాడి చేసినట్టు చెప్పింది. దాంతో ఆమె బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇన్నోవా కారులో 16, 17 ఏండ్ల బాలురు ఉన్నారని, వారిలో ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ఉన్నట్టు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. ఎమ్మెల్యే కుమారుడి ప్రమేయంపై టెక్నికల్ ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బెంజి కారును సీజ్ చేశారు. అయితే, ఈ కేసులో వక్ఫ్‌బోర్డ్ చైర్మెన్ కుమారుడు, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
నిందితులను అరెస్టు చేయాలి:సీపీఐ(ఎం) నగర కమిటీ
అమ్నీషియా పబ్ నుంచి బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి ఒడిగట్టిన దుర్మార్గులను అరెస్టు చేయాలని, పబ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పాతబస్తీకి చెందిన రాజకీయ నాయకుల కొడుకులు ఈ కేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని, సదరు వ్యక్తులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పబ్‌లలో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరుతున్నా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా నిబంధనలు పాటించని పబ్‌లపై కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
- దర్యాప్తు వేగవంతం
- ఎంతటి వారినైనా వదిలే ప్రశక్తే లేదు
- ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు
- ఏసీపీ స్థాయి అధికారితో విచారణ
- వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవీస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జూబ్లీహిల్స్‌లో బాలికపై లైంగికదాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసినట్టు వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవీస్ తెలిపారు. శుక్రవారం డీసీపీ తెలిపిన వివరాల మేరకు..
గత నెల 28న పార్టీ ఉందని బాలిక తన స్నేహితులతో కలిసి అమ్నేషియా పబ్‌కు వెళ్లారు. అనంతరం ఇన్నోవా కారులో మరికొంత మంది యువకులు బాలికను తీసుకెళ్లారు. కారులోనే బాలికపై లైంగికదాడి చేశారు. సంఘటన అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. మూడ్రోజుల తర్వాత బాధితురాలి తండ్రి డీసీపీకి గత నెల31న ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి ఐదుగురు నిందితులపై ఫోక్సో చట్ట ప్రకారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మేజర్లు కాగా ముగ్గురు మైనర్లున్నారు. ఈ కేసులో ఉప్పల్గూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్‌తో పాటు మరో నిందితుడ్ని అరెస్టు చేశారు. సివిల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పరారీలో వున్న నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు విచారణాధికారిగా ఏసీపీ ర్యాంక్ అధికారిని నియమించారు. హోంమంత్రి మనవడికి, ఎమ్మెల్యే కొడుకుకు ఈ కేసుతో సంబంధం లేదు. ఆ ఆరోపణలు పూర్తి అవాస్తవం. పబ్ నుంచి యువతిని తీసుకెళ్లి, వదిలే వరకు ఉన్న అన్ని ఆధారాలను పోలీసులు పరిశీలించారు. అనవసరంగా ఆరోపిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పిల్లలు, వారి తల్లిదండ్రుల భవిష్యత్ పాడవుతుందని డీసీపీ చెప్పారు. అయితే ఓ ప్రముఖుని కుమారుడి ప్రమేయం ఉన్నట్టు సమాచారం ఉందనీ, పూర్తి స్థాయి విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని డీసీపీ తెలిపారు.