Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యంగా ఉద్యమిస్తూ ముందుకు సాగుదాం
- అన్ని పార్టీలతో కలిసి త్వరలో రౌండ్‌టేబుల్
- రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి
- తుక్కు కింద విక్రయిస్తే ప్రజలు తుక్కుతుక్కు చేస్తారు..:
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
సీసీఐ పరిశ్రమ కోసం పోరాటం ఏ ఒక్కరిదో కాదు.. అందరిదీ.. పరిశ్రమను తిరిగి పునరుద్ధరించే వరకు విశ్రమించం.. ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పరిశ్రమలోని వస్తువులను తుక్కు కింద విక్రయించాలని చూస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు తుక్కుతుక్కు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన తమ్మినేని సీసీఐ సాధన కమిటీ నాయకులతో కలిసి పరిశ్రమను సందర్శించారు. అక్కడి యంత్రాలు, సామగ్రిని పరిశీలించారు. అనంతరం మాట్లాడారు.
పరిశ్రమను నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని, మాటలకే పరిమితం కాకుండా క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. జిల్లాల విభజన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక పరిశ్రమ సీసీఐ అన్నారు. ఈ పరిశ్రమను కొనసాగించేందుకు ఇక్కడ 48లక్షల టన్నుల ముడిసరుకు ఉండగా.. 6లక్షల టన్నులు మాత్రమే వినియోగించారని తెలిపారు. లైమ్‌స్టోన్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరుకు రవాణాకు అత్యంత అనుకూలమైన రైల్వేమార్గం, జాతీయ రహదారి వంటి సౌకర్యాలున్నాయని చెప్పారు. గతంలో కొన్ని పరిశ్రమలు నష్టాల్లో కొనసాగితే ప్రభుత్వం రాయితీలు ఇచ్చి తిరిగి ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం రూ.15కోట్ల నష్టం సాకుగా చూపి ఆదిలాబాద్ సీసీఐని మూసేయడం దారుణమన్నారు. అనేక మంది కార్మికుల కుటుంబాల నోట్లో మట్టికొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరంగా పరిశ్రమ కోసం భూమిని తీసుకుంటే కచ్చితంగా ఆ భూమిలో పరిశ్రమ ఏర్పాటు చేసి నడిపించాలని, లేనిపక్షంలో తిరిగి భూమిని రైతులకు అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూనిర్వాసితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీసీఐ పరిశ్రమను పునరుద్ధరిస్తే అన్ని రాయితీలు ఇచ్చేందుకు ముందుకు రావడం, మరోపక్క రాష్ట్రానికి అప్పగిస్తే సొంతంగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం సంతోషకరమని.. ఇందుకు మంత్రి కేటీఆర్‌కు అభినందలు చెబుతున్నట్టు తమ్మినేని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకు పేర్కొన్న మూడు అంశాల్లో కేంద్రం దేనికి సిద్ధంగా ఉందో తెలుసుకొని మళ్లీ ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.
కేవలం మాటలతో కాకుండా రాతపూర్వకంగా క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. సీసీఐ పునరుద్ధరణకు అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంలో ఏదో కుట్ర దాగి ఉందని, దాన్ని కచ్చితంగా బయటపెడతామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి త్వరలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి పోరాటానికి రూపకల్పన చేస్తామని చెప్పారు. పరిశ్రమను పునరుద్ధరించే వరకు ఇదే ఐక్యతను ప్రదర్శించాలని సాధన సమితి నాయకులకు సూచించారు. ఆయన వెంట సీసీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, అడివయ్య, తొడసం భీంరావు, సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కోకన్వీనర్ ఇజ్జగిరి నారాయణ, సభ్యులు బండి దత్తాత్రి, లంక రాఘవులు, అరవింద్, బొల్లు ఈశ్వర్, లోకారి పోశెట్టి, కొండ రమేష్, అరుణ్‌కుమార్, రాములు, ఎండీ రఫీక్, భూనిర్వాసితులు ఉన్నారు.